
ధోనితో విభేదాల్లేవు: గంభీర్
మహేంద్ర సింగ్ ధోనితో తనకు విభేదాలు ఉన్నాయని, అదే కారణంగా తాను జట్టుకు దూరమయ్యానని చాలా కాలంగా ప్రచారంలో ఉన్న వార్తలను గౌతం గంభీర్ కొట్టిపారేశాడు.
న్యూఢిల్లీ: మహేంద్ర సింగ్ ధోనితో తనకు విభేదాలు ఉన్నాయని, అదే కారణంగా తాను జట్టుకు దూరమయ్యానని చాలా కాలంగా ప్రచారంలో ఉన్న వార్తలను గౌతం గంభీర్ కొట్టిపారేశాడు. తనకు ధోనితో పడదంటూ జరిగిన చర్చపై అతను స్పష్టంగా తన అభిప్రాయం వెల్ల డించాడు. ‘ఒకే చోట కలిసి ఉన్నప్పుడు అది కుటుంబం అయినా మరో చోట అయినా జీవితంలో చాలా మంది అభిప్రాయాల్లో తేడాలు ఉండటం సహజం. అంతే గానీ అదేమీ వైరంలాంటిది కాదు. మా ఇద్దరి మధ్య ఎలాంటి సమస్య లేదు.
మేం కలిసి ఆడిన ప్రతీసారి సొంత అభిప్రాయాలు ఎలా ఉన్నా... చివరకు జట్టును గెలిపించడమే లక్ష్యంగా ఆడాం. అతనో గొప్ప ఆటగాడు, మంచి మనిషి. టి20 ప్రపంచ కప్, వన్డే ప్రపంచ కప్ విజయాలవంటి చిరస్మరణీయ జ్ఞాపకాలు మేమిద్దరం కలిసి పంచుకున్నాం’ అని గంభీర్ స్పష్టం చేశాడు. కొన్నాళ్ల క్రితం ధోనిపై రూపొందిన సినిమా విడుదల సమయంలో క్రికెటర్లపై అసలు బయోపిక్‌లు అవసరం లేదంటూ గంభీర్ వివాదాస్పద వ్యాఖ్య చేశాడు.