గౌతం గంభీర్ (పాత ఫొటో PC: BCCI)
Gautam Gambhir reveals the only time when he felt pressure: టీ20 వరల్డ్‌కప్-2007.. సౌతాఫ్రికా గడ్డపై దాయాది పాకిస్తాన్‌తో ఫైనల్లో 54 బంతుల్లో 75 పరుగులు.. టాప్ స్కోరర్‌గా నిలిచి జట్టు విశ్వవిజేతగా అవతరించడంలో కీలక పాత్ర.. వన్డే ప్రపంచకప్-2011లోనూ అలాంటి ఫలితమే పునరావృతం..
సొంతగడ్డపై శ్రీలంకతో ఫైనల్ మ్యాచ్.. 275 పరుగుల లక్ష్యం స్టార్ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్ డకౌట్.. సచిన్ టెండుల్కర్ 18 పరుగులకే వెనుదిరగడం టీమిండియా అభిమానులను ఉసూరుమనిపించింది. కానీ తానున్నానంటూ ఆ వన్‌డౌన్ బ్యాటర్ ఫ్యాన్స్ ఆశలకు ఊపిరినిచ్చాడు.
అప్పుడలా..
తీవ్రమైన ఒత్తిడి నెలకొన్న వేళ 122 బంతులు ఎదుర్కొని విలువైన 97 పరుగులు సాధించాడు.. ఇక ఐదో స్థానంలో వచ్చిన నాటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 91 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి సిక్సర్‌తో భారత్‌ను మరోసారి జగజ్జేతగా నిలిపాడు.
ఈ రెండు సందర్భాల్లో మిగతా బ్యాటర్లు విఫలమైన వేళ.. ఒత్తిడిని అధిగమించిన ఆ బ్యాటర్ మరెవరో కాదు గౌతం గంభీర్. ఐసీసీ ఈవెంట్లలో తన అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును విజయపథంలో నడపడంలో ముందుండి కోట్లాది మంది అభిమానానికి గౌతీ పాత్రుడయ్యాడు.
అలా చేసినందుకు సిగ్గుపడుతున్నా
మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లలో రాణించిన ఈ స్టార్ ఓపెనర్ తీవ్రమైన ఒత్తిడికి లోనైన సందర్భంగా ఒకటే ఒకటి ఉందట. 2014 ఐపీఎల్ సందర్భంగా తన ప్రదర్శన తనకే సిగ్గు అనిపించిందట. ‘‘నా జీవితంలో నేను అత్యంత ఒత్తిడికి గురైన సందర్భం అదే.
2014లో దుబాయ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా ఉన్న సమయంలో మూడుసార్లు వరుసగా డకౌట్ అయ్యాను. నాలుగో మ్యాచ్ అంటే నాకు కాస్త భయం వేసింది. నా బదులు మనీశ్ పాండేను ఓపెనింగ్ చేయమని అడిగాను.
నాలో ఉన్న భయం కారణంగానే..
నేను మూడోస్థానంలో బ్యాటింగ్‌కు వస్తానని చెప్పాను. నిజానికి నాలో ఉన్న భయం కారణంగానే నేను అతడిని ప్రమోట్ చేశాను. ఈ పని చేసినందుకు నేను సిగ్గుపడుతున్నానని చెప్పడానికి ఏమాత్రం సిగ్గుపడటం లేదు. ఆ మ్యాచ్‌లో మనీశ్ పరుగుల ఖాతా తెరవలేదు. నేను ఒక్క పరుగు చేసి అవుటయ్యాను. ఆ తర్వాత మనీశ్‌ను పిలిచి ఇంకెప్పుడు ఇలా చేయనని చెప్పాను.
ఇంకెప్పుడూ అలా చేయనని చెప్పా.. అదే
నేనే ఇన్నింగ్స్ ఆరంభిస్తానని చెప్పాను. ఎప్పుడూ లేనిది ఆరోజు నేను తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాను. ఆ తర్వాతి మ్యాచ్‌లో కేన్ రిచర్డ్‌సన్ బౌలింగ్‌లో మొదటి బంతికే ఫోర్ కొట్టాను. నా ఐపీఎల్ కెరీర్ పొడిగించుకోవడంలో ఆ ఒక్క బౌండరీ ఎంతగా ఉపయోగపడిందో మాటల్లో చెప్పలేను’’ అని గౌతం గంభీర్ రెవ్‌స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో తన చేదు అనుభవం గురించి వెల్లడించాడు. ఇక ఐపీఎల్-2014లో గంభీర్ సేన చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment