ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో విజయవంతమైన కెప్టెన్లలో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఒకడు. రోహిత్ శర్మ(ముంబై ఇండియన్స్), మహేంద్ర సింగ్ ధోని(చెన్నై సూపర్ కింగ్స్) చెరో ఐదుసార్లు టైటిల్ గెలవగా.. గంభీర్ రెండుసార్లు ట్రోఫీ అందుకున్నాడు.
కోల్‌కతా నైట్ రైడర్స్‌ను 2012, 2014 సీజన్లలో చాంపియన్‌గా నిలిపాడు. ఆ తర్వాత ఢిల్లీ ఫ్రాంఛైజీకి మారినా స్థాయికి తగ్గట్లు రాణించలేక క్యాష్ రిచ్ లీగ్‌కు గంభీర్ గుడ్‌బై చెప్పాడు. మళ్లీ ఐపీఎల్-2023లో లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా రీఎంట్రీ ఇచ్చాడు గౌతీ.
అయితే, తాజా ఎడిషన్ నేపథ్యంలో మెంటార్‌గా సొంతగూటికి చేరుకున్నాడు గంభీర్. అతడి మార్గదర్శనంలో కేకేఆర్ మరోసారి టైటిల్ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసులో ముందున్న కోల్‌కతా ట్రోఫీ గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
ఇదిలా ఉంటే.. కేకేఆర్ సహ యజమాని షారుఖ్ ఖాన్‌తో తనకున్న అనుబంధం గురించి గౌతం గంభీర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడుతూ.. ‘‘అతడితో నా బంధం ఎంతో అద్భుతమైనది. నాతో కలిసి పనిచేసిన ఫ్రాంఛైజీ ఓనర్లలో అత్యుత్తమ వ్యక్తి అతడు.
కేవలం నిరాడంబరంగా ఉంటాడని మాత్రమే నేను ఈ మాట చెప్పడం లేదు. ఎంత ఎదిగినా ఒదిగే ఉండే తత్వం అతడిది. క్రికెటింగ్ విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోడు.
స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే వాతావరణం కల్పిస్తాడు. అలాంటి ఓనర్ ఉండటం నిజంగా అదృష్టం. నా ప్రతీ నిర్ణయంపై నమ్మకం ఉంచి.. నాకు మద్దతుగా నిలిచాడు.
అందుకే ఫలితాలతో సంబంధం లేకుండా మా అనుబంధం ఇన్నేళ్లుగా కొనసాగుతోంది. 2011 నుంచి అతడితో నా బంధం ఇలాగే ఉంది. ఎస్‌ఆర్‌కే ఓ ఎమోషన్ అని అందరూ చెప్తారు. అయితే, అతడితో పాటు నాకు కేకేఆర్ కూడా ఓ ఎమోషనే! పరస్పరం నమ్మకం ఉంటేనే ముందుకు వెళ్లగలుగుతాం’’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
కాగా లక్నో సూపర్ జెయింట్స్ సంజీవ్ గోయెంకా ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను బహిరంగంగానే తిట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లక్నో యాజమాన్యంతో కలిసి పనిచేసిన గంభీర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment