ఔను! తప్పుచేశాను, క్షమించండి: గంభీర్
కోల్‌కతా: బెంగళూరు రాయల్ చాలెంజర్స్‌తో సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ చివర్లో సూర్యకుమార్ బౌండరీ కొట్టగానే.. గౌతం గంభీర్ చాలా విచిత్రంగా వ్యవహరించాడు. కట్టలు తెగిన భావోద్వేగంతో అతడు కనిపించాడు. చేతిలో టవల్‌ను నేలకేసి కొట్టి.. పక్కన ఉన్న కూర్చీలను పిచ్చికోపంతో తన్నేశాడు. ఈ దృశ్యాలు లైవ్‌లో పదేపదే ప్రసారమయ్యాయి. తాను నాయకత్వం వహిస్తున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు విజయం సాధించినా గంభీర్ ఇలా ఎందుకు ప్రవర్తించాడో అర్థం కాక కామెంటెటర్లు కూడా తికమకపడ్డారు.
ఇంత ఆగ్రహంగా ప్రవర్తించడంపై మ్యాచ్ రిఫరీ కొరడా ఝలిపించాడు. ఈ ప్రవర్తనకుగాను గంభీర్‌ను మందలించడమే కాదు మ్యాచ్ ఫీజులో 15శాతం కోత విధించాడు. ఇప్పటికే తన కెప్టెన్సీలో రెండుసార్లు కోల్‌కతా జట్టుకు ఐపీఎల్ కప్‌ను అందించిన గంభీర్‌కు వివాదాలు కొత్త కాదు. తాజాగా అతని తీరుపై పలువైపుల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో గంభీర్ స్పందించాడు. 'ఔను! నేను తప్పచేశాను. అలా కుర్చీలను తన్ని ఉండాల్సింది కాదు' అంటూ వివరణ ఇచ్చాడు.
ఓ మీడియాకు రాసిన వ్యాసంలో తన ప్రవర్తనకుగాను క్షమాపణలు చెప్పాడు. అదే సమయంలో క్రికెటర్లు కూడా మనుషులేనని, వారికి భావోద్వేగాలు ఉంటాయని తన ప్రవర్తనను సర్దిచెప్పుకొనే ప్రయత్నం చేశాడు. తన ప్రవర్తనకు చింతిస్తున్నానని చెప్పాడు. తన ప్రవర్తనను ప్రధానంగా చూపి బెంగళూరుతో మ్యాచ్‌లో మెరుపులు మెరిపించిన యూసుఫ్ పఠాన్, అండ్రూ రస్సెల్ బ్యాటింగ్ ప్రతిభను పట్టించుకోకపోవడం సబబు కాదని చెప్పాడు. పఠాన్, రస్సెల్ మెరుపులతో బెంగళూరుపై కోల్‌కతా అద్భుతమైన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.