నేరుగా ధోని వద్దకు పో..! | Go Ask MS Dhoni Directly, Have No Idea, Rohit Sharma | Sakshi
Sakshi News home page

నేరుగా ధోని వద్దకు పో..!

Published Fri, Apr 24 2020 11:31 AM | Last Updated on Fri, Apr 24 2020 11:40 AM

Go Ask MS Dhoni Directly, Have No Idea, Rohit Sharma - Sakshi

ఎంఎస్‌ ధోని-రోహిత్‌ శర్మ(ఫైల్‌ఫొటో)

ముంబై: భారత క్రికెట్‌లో దాదాపు ఆరు-ఏడు నెలలుగా ఎక్కువగా వినిపిస్తున్న మాట ఏదైనా ఉందంటే అది ఎంఎస్‌ ధోని భవితవ్యం గురించే. తన భవిష్యత్తు గురించి ధోనికి ఏమీ బెంగలేకపోయినా, ఫ్యాన్స్‌ మాత్రం ఏం జరుగుతుందనే ఆతృతలో ఉన్నారు. కనీసం ఏ మాట చెప్పకుండా ఇక్కడ కూడా మిస్టర్‌ కూల్‌గా ఉంటూ వస్తున్న ధోని వైఖరి సహచర క్రికెటర్ల కూడా విసుగు తెప్పిస్తుందనే చెప్పాలి. ధోని ఆడతాడా.. లేదా అనే విషయం ఇప్పటికైతే బోర్‌ కొట్టిసినట్లే కనబడుతోంది భారత క్రికెటర్లకు. తాజాగా ధోని క్రికెట్‌ కెరీర్‌పై రోహిత్‌ శర్మ చెప్పిన సమాధానమే ఇందుకు ఉదాహరణ. ధోని ఏమో ఏ మాట చెప్పకపోగా, అభిమానులు మాత్రం విసుగు తెప్పిస్తుంటే రోహిత్‌ శర్మ తీవ్రంగా అసహనం వ్యక్తం చేశాడు. 

కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో ఇంటికే పరిమితమైన హిట్ మ్యాన్..  ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్స్‌లో పాల్గొని క్రికెట్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలతో అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కెవిన్ పీటర్సన్, జస్‌ప్రీత్ బుమ్రా, యువరాజ్ సింగ్‌‌తో లైవ్ సెషన్స్‌లో పాల్గొన్న ఈ ముంబై క్రికెటర్.. తాజాగా భారత సీనియర్ స్పిన్నర్ హర్బజన్ సింగ్‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చాట్‌లో పాల్గొన్నాడు. దీనిలో భాగంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ధోని భవితవ్యంపై ప్రశ్నించగా రోహిత్ తనదైన శైలిలో బదులిచ్చాడు. (రోహిత్‌ను కాదన్నాడు.. కానీ కారణం బాలేదు..!)

‘ధోని క్రికెట్ ఆడటం ఆపేస్తే ఎవరికీ దొరకడు. అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లిపోతాడు. ధోని రాంచీలో ఉంటాడని అందరికీ తెలుసు. అతను మళ్లీ ఆడతాడా లేదా అనుమానం చాలామందిలో ఉంది. నువ్వొక  పని చేయ్‌..లాక్‌డౌన్‌ ఉంది కాబట్టి ఇప్పుడు ఎక్కడికీ వెళ్లకు. లాక్‌డౌన్‌ ముగిసిపోయాక ఒక కారు కానీ, బైక్‌ కానీ, ఫ్లయిట్‌ కానీ తీసుకుని రాంచీ వెళ్లిపో. నేరుగా ధోని ఇంటికో పో. అక్కడ ధోని ఉంటాడు కదా.. అతన్నే అడుగు. మీరు ఆడతారా.. లేక ఆడరా అనే విషయాన్ని అడుగు. మాకైతే ధోని గురించి ఏ సమాచారం తెలియదు.  కనీసం ఐడియా కూడా లేదు. ఏ న్యూస్‌ కూడా తెలియదు. వరల్డ్‌కప్‌ తర్వాత ధోని నుంచి ఎటువంటి సమాచారం మాకు లేదు’ అని రోహిత్‌ సమాధానమిచ్చాడు.  ఇక హర్భజన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ చాట్‌లో ముచ్చటిస్తూ.. ‘ టీమిండియా జెర్సీని ధోని ధరించకపోవచ్చు. అతనికి ఇక భారత్‌ జట్టుకు ఆడాలని లేనట్లే ఉంది’ అని పేర్కొన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement