
వెల్లింగ్టన్: ఇప‍్పటికే టీమిండియాతో వన్డే సిరీస్‌ను కోల్పోయిన న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ తగలింది. భారత్‌తో జరుగబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు స్టార్ ఆటగాడు మార్టిన్ గప్టిల్ దూరమయ్యాడు. వెన్నునొప్పితో బాధపడుతున్న గప్టిల్.. టీ20 సిరీస్ మొత్తానికి దూరమవుతున్నాడని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అతని స్థానంలో జేమ్స్ నీషమ్‌ను జట్టులోకి తీసుకున్నారు. తొలుత ప్రకటించిన టీ20 జాబితాలో నీషమ్ లేకపోయినప్పటికీ, గప్టిల్ గాయం కారణంగా అతన్ని ఉన్నపళంగా జట్టులోకి తీసుకున్నారు. భారత్‌తో చివరిదైన ఐదో వన్డేకు గప్టిల్ దూరమైన సంగతి తెలిసిందే. గప్టిల్ కోలుకోవడానికి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో టీ20 సిరీస్‌కు సైతం దూరం కావాల్సి వస్తుందని కివీస్ కోచ్ గ్యారీ స్టీడ్ తెలిపాడు.
‘టీ20 సిరీస్‌కు గప్టిల్‌కు అందుబాటులో లేకపోవడం దురదృష్టకరం. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్ ఐదు రోజుల వ్యవధిలోనే ముగియనుంది. ఈ వ్యవధిలో గప్టిల్ కోలుకోవడం కష్టం. దాంతో అతనికి సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చాం. ఈ నెల 13వ తేదీ నుంచి బంగ్లాదేశ్‌తో ఆరంభమయ్యే వన్డే సిరీస్ నాటికి గప్టిల్ జట్టుతో కలిసే అవకాశం ఉంది’ అని గ్యారీ స్టీడ్ పేర‍్కొన్నాడు. భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య బుధవారం నుంచి టీ20 సిరీస్ ఆరంభం కానుంది. తొలి టీ20 ఫిబ్రవరి6వ తేదీన వెల్లింగ్టన్ వేదికగా జరుగుతుండగా, ఫిబ్రవరి 8వ తేదీన ఆక్లాండ్ వేదికగా రెండో టీ20 , ఫిబ్రవరి 10వ తేదీన హామిల్టన్ వేదికగా మూడో టీ20 జరుగనున్నాయి.