
దుమ్మురేపిన హఫీజ్
షార్జా: న్యూజిలాండ్‌తో బుధవారం ప్రారంభమైన మూడో టెస్టులో పాకిస్థాన్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. మహ్మద్ హఫీజ్ (262 బంతుల్లో 178 బ్యాటింగ్; 23 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో చెలరేగడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 3 వికెట్లకు 281 పరుగులు చేసింది. హఫీజ్‌తో పాటు మిస్బా (38 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. షార్జా క్రికెట్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో... మిస్బా సేన టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లలో షాన్ మసూద్ (12) విఫలమైనా.. హఫీజ్ నిలకడగా ఆడాడు.
వన్‌డౌన్‌లో వచ్చిన అజహర్ అలీ (39) మెరుగ్గా ఆడినా భారీ స్కోరు చేయలేకపోయాడు. హఫీజ్‌తో కలిసి రెండో వికెట్‌కు 87 పరుగులు జోడించి అవుటయ్యాడు. తర్వాత వచ్చిన యూనిస్ ఖాన్ (5) నిరాశపర్చడంతో పాక్ 160 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. అయితే ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ మిస్బా ఎక్కువ భాగం హఫీజ్‌కు స్ట్రయిక్ ఇస్తూ ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. ఈ క్రమంలో హఫీజ్ కెరీర్‌లో ఏడో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు అజేయంగా 121 పరుగుల భాగస్వామ్యం జోడించారు.