సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా తమ చివరి ఆరు వికెట్లు ఒకే స్కోర్ వద్ద (153) కోల్పోయిన ఘటన మరువక ముందే.. దాయాది పాకిస్తాన్ దాదాపుగా ఇలాంటి సీన్‌నే మరోసారి రిపీట్ చేసింది.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న నామమాత్రపు మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో పాక్ తొమ్మిది పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లు కోల్పోయి, ఏ విషయంలోనైనా వారు భారత్‌నే ఫాలో అవుతారనే విషయాన్ని మరోసారి రుజువు చేశారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. లోయర్ ఆర్డర్ ఆటగాళ్ల పుణ్యమా అని తొలి ఇన్నింగ్స్‌లో 313 పరుగులు చేసింది. ఆరో నంబర్ ఆటగాడు మొహమ్మద్ రిజ్వాన్ (88), ఏడో నంబర్ ఆటగాడు అఘా సల్మాన్ (53), తొమ్మిదో నంబర్ ప్లేయర్ ఆమిర్ జమాల్ (82) అర్ధసెంచరీలు చేసి పాక్‌ను ఆదుకున్నారు.
అనంతరం ఆమిర్ జమాల్ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో (6/69) తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను 299 పరుగులకే పరిమితం చేసి, ప్రస్తుత సిరీస్‌లో పాక్‌కు తొలి గెలుపుపై ఆశలు రేకెత్తించాడు. అయితే పాక్ బ్యాటర్లు ఈ అవకాశాన్ని ఒడిసిపట్టుకోవడంలో దారుణంగా విఫలమయ్యారు.
సెకెండ్ ఇన్నింగ్స్‌లో 58 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన పాక్.. ఆతర్వాత తొమ్మిది పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లు కోల్పోయి మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు స్కోర్ 67/7గా ఉంది. ప్రస్తుతం ఆ జట్టు కేవలం 82 పరుగుల ఆధిక్యంలో ఉంది. చేతిలో మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పాక్ ఈ మ్యాచ్‌ను కాపాడుకోవడం చాలా కష్టం.
సెకెండ్ ఇన్నింగ్స్‌లో హాజిల్‌వుడ్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో (5-2-9-4) పాక్‌ను కష్టాల ఊబిలోకి నెట్టాడు. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లను గెలిచిన ఆసీస్ ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. పాక్ ఈ మ్యాచ్ కూడా ఓడితే ఆసీస్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసినట్లవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment