
మెక్సికో సిటీ: మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్‌కే ‘ఫార్ములావన్’ చేజిక్కింది. అతను నాలుగోసారి డ్రైవర్స్‌ప్రపంచ చాంపియన్‌షిప్ గెలిచాడు. సీజన్‌లో మరో రెండు రేసులు మిగిలుండగానే 32 ఏళ్ల ఈ బ్రిటన్ డ్రైవర్ విజేతగా నిలవడం అనూహ్యం. టైటిల్ కోసం సెబాస్టియన్ వెటెల్‌తో నెలకొన్న పోటీ మెక్సికో గ్రాండ్ ప్రిలో నాటకీయంగా ముగిసింది. ఆదివారం జరిగిన ఈ రేసులో రెడ్‌బుల్ డ్రైవర్ వెర్‌స్టాపెన్ టైటిల్ గెలిచాడు. దీంతో వెటెల్ (ఫెరారీ టీమ్) ఒకవేళ మిగిలున్న రెండు గ్రాండ్‌ప్రి (బ్రెజిలియన్, అబుదాబి)లను గెలిచినా... హామిల్టన్‌ను అందుకోలేడు. దీంతో బ్రిటన్ డ్రైవర్‌కే చాంపియన్‌షిప్ ఖాయమైంది. ఈ ఇంగ్లిష్ రేసర్ తొలి సారి మెక్‌లారెన్ తరఫున 2008లో టైటిల్ గెలిచాడు.
తదనంతరం మెర్సిడెస్‌తో జతకట్టాడు. 2014, 2015 సంవత్సరాల్లో వరుసగా రెండుసార్లు డ్రైవర్స్ చాంపియన్‌షిప్ గెలిచాడు. తాజాగా మెర్సిడెస్ తరఫున మూడోసారి, ఓవరాల్‌గా నాలుగోసారి ‘రేసింగ్ కింగ్’ అయ్యాడు. దీనిపై హామిల్టన్ స్పందిస్తూ ‘నా విజయానికి తోడ్పడిన మెర్సిడెస్ బృందానికి కృతజ్ఞతలు. కొన్నేళ్లుగా మావాళ్లు చాలా కష్టపడుతున్నారు. వాళ్లందరికి థ్యాంక్స్’ అని అన్నాడు. ఈ సీజన్‌లో అతను 9 రేసుల్లో గెలిచాడు. ప్రస్తుతం హామిల్టన్ 333 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా... వెటెల్ (277) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
వెర్‌స్టాపెన్ గెలుపు: మెక్సికో గ్రాండ్‌ప్రిలో రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్ విజేతగా నిలిచాడు. 71 ల్యాపుల రేసును అతను 1 గంటా 36 ని.26.552 సెకన్లలో పూర్తి చేశాడు. వెటెల్ నాలుగో స్థానంలో, హామిల్టన్ తొమ్మిదో స్థానంలో నిలిచారు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్ ఐదు, పెరెజ్ ఏడో స్థానం పొందారు. తదుపరి బ్రెజిలియన్ గ్రాండ్ ప్రి నవంబర్ 12న సావోపాలోలో జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment