కాకినాడ కుర్రాడు వెస్టిండీస్‌ టూర్‌కు | Hanuma Vihari To West Indies Tour | Sakshi
Sakshi News home page

కాకినాడ కుర్రాడు వెస్టిండీస్‌ టూర్‌కు

Published Sat, Jul 27 2019 10:44 AM | Last Updated on Sat, Jul 27 2019 11:01 AM

Hanuma Vihari To West Indies Tour - Sakshi

కాకినాడ రూరల్‌ :  కాకినాడలో పుట్టిన కుర్రాడు గాదె హనుమ విహారి భారత క్రికెట్‌ జట్టులో స్థానం సంపాదించి... అంచెలంచెలుగా ఎదుగుతూ వెస్టిండీస్‌ టూర్‌కు వెళ్లడం పట్ల క్రికెట్‌ అభిమానుల్లో హర్షం వ్యక్తమవుతోంది. కాకినాడ భానుగుడి సెంటర్‌ సమీపంలో అమ్మమ్మగారి ఇంట్లో 1993 అక్టోబర్‌ 13వ తేదీన హనుమ విహారి జన్మించాడు. తండ్రి గాదె సత్యనారాయణ సింగరేణి కాలరీస్‌ సంస్థలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తూ 2005లో ఉద్యోగ విరమణ చేసి అదే ఏడాది చనిపోయారు. ప్రస్తుతం తల్లి విజయలక్ష్మి, అక్క వైష్టవి హైదరాబాద్‌లో ఉంటున్నారు. తల్లికి ఇష్టమైన క్రికెట్‌ను టీవీలో చూస్తుండటంతో ఆ ఇష్టాన్నే లక్ష్యంగా చేసుకొని కాకినాడలోనే ఏసీఏ క్రికెట్‌ ఆపరేషన్‌ హెడ్‌గా పనిచేసిన మాజీ క్రికెటర్, ప్రస్తుత బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌ దృష్టిని ఆకర్షించాడు.

బ్యాటింగ్‌ స్ట్రైక్‌ రేట్‌లో ప్రపంచంలోనే మొదటి స్థానంగా నిలిచి అత్యధికంగా బ్యాటింగ్‌లో ఏవరేజ్‌గా 59.79గా నమోదు చేసుకుని క్రికెట్‌లో జోరుగా సాగుతున్న విహారికి ఎంఎస్కే ప్రోత్సాహాన్ని అందించి అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంపికయ్యేలా చేశారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ టూర్లకు ఎంపికైన విహారీ సెలక్టర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. అయినా విహారిపై ఉన్న నమ్మకంతో మరోసారి అంతర్జాతీయ క్రికెట్‌కు సెలక్టర్లు ఎంపిక చేశారు. హాఫ్‌ స్పిన్నర్‌ కావడంతో అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో జట్లను ఆదుకుంటాడని భారత్‌ జట్టు వెస్టిండీస్‌ టూర్‌లో వన్‌డే, టెస్ట్‌ 20–20 మ్యాచ్‌లలో  ఆడేందుకు ఆంధ్రా రంజీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న హనుమ విహారి వైపే సెలక్టర్లు మొగ్గుచూపించారు. ఎంతో ప్రతిభ కలిగిన విహారి దేశవాళీ క్రికెట్‌లో రాణించినట్లుగా అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించలేక అభిమానులకు నిరాశనే మిగిల్చాడు. సెలక్టర్లు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వెస్టిండీస్‌ టూర్‌లో తన స్థాయికి తగ్గ ప్రతిభను అటు బ్యాటింగ్‌లోను, ఇటు బౌలింగ్‌లోను కనబరచి జిల్లా కీర్తిని పెంపొందించాలని క్రికెట్‌ సంఘ ప్రతినిధులు, అభిమానులు కోరుకుంటున్నారు.

క్రికెట్‌ అంటే ప్రాణం..
విహారికి చిన్నతనం నుంచి క్రికెట్‌ అంటే ప్రాణం. తండ్రి కోరికను నెరవేర్చడానికి చివరి బంతి వరకు క్రీజ్‌లో నిలబడి ఆడేవాడు. వెస్టిండీస్‌ టూర్‌కు ఎంపికైన సందర్భంగా రెండు టెస్ట్‌ల్లో కూడా మంచి పరుగులు చేసి తన స్థానాన్ని పదిల పరుచుకుంటాడని ఆశిస్తున్నాం.
– డాక్టర్‌ స్పర్జన్‌రాజు,  రంగరాయ మెడికల్‌ కళాశాల, ఫిజికల్‌ డైరెక్టర్, కాకినాడ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement