
కార్తీక్‌కు తనపై తనకు విశ్వాసం ఉండటం మంచిదే. కానీ అదే నమ్మకాన్ని ఇతరులపై
ముంబై : చివరి ఓవర్లో దినేశ్ కార్తీక్ సింగిల్ తీయకపోవడం ముమ్మాటికే తప్పేనని టీమిండియా సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20లో భారత్ 4 పరుగుల తేడాతో ఓడి సిరీస్ కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే దినేశ్ కార్తీక్ సింగిల్ తీయకపోవడం వల్లే భారత్ ఓడిందని అభిమానులు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో హర్భజన్ ఈ వివాదంపై స్పందించాడు. తాను కూడా కార్తీక్‌నే తప్పుబట్టాడు.
ఓ జాతీయ ఛానెల్‌తో మాట్లాడుతూ..‘ దినేశ్ కార్తీక్ చేసిన చిన్న తప్పు వల్లే భారత్ పరాజయం చవి చూసింది. అతను సింగిల్ తీయకపోవడం భారత విజయవకాశాలను దెబ్బతీసింది. కార్తీక్‌కు తనపై తనకు విశ్వాసం ఉండటం మంచిదే. కానీ అదే నమ్మకాన్ని ఇతరులపై కూడా ఉంచాలి. ముఖ్యంగా వారు బాగా ఆడుతున్నప్పుడు వారికి కూడా అవకాశం ఇవ్వాలి. గతేడాది నిదహాస్ ట్రోఫి ఫైనల్లో గెలిపించడంతో కార్తీక్‌కు ఫినిషర్ ట్యాగ్ వచ్చింది. కానీ అక్కడ బౌలింగ్ చేసింది సౌమ్య సర్కార్ కానీ, టీమ్ సౌతి కాదనే విషయాన్ని గ్రహించాలి. కృనాల్ అంతకు ముందు సౌతీ ఓవర్లో 18 పరుగుల రాబట్టాడు. ఆ సింగిల్ తీసి కృనాల్‌కు అవకాశం వస్తే పరిస్థితి మరోలా ఉండేది. ఏది ఏమైనా కార్తీక్ చేసిన తప్పు భారత గెలుపు అవకాశాలను దెబ్బతీసింది’ అని పేర్కొన్నాడు.
ప్రతిష్టాత్మక ప్రపంచకప్ ముందు టీమ్ మేనేజ్‌మెంట్ చేపట్టిన ప్రయోగాలు ఫలించాయని అభిప్రాయపడ్డాడు. కివీస్ సిరీస్‌ను భారత్ సన్నాహకంలో భాగంగానే భావించిందని, అందుకే స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా, కెప్టెన్ విరాట్ కోహ్లిలకు విశ్రాంతినిచ్చిందని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో బుమ్రా, చహల్‌లు ఉంటే కివీస్ 200 పరుగులు చేసేది కాదన్నాడు.