ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ చేరాలంటే టీమిండియా ఇక ముందు మరింత జాగ్రత్తగా అడుగువేయాల్సి ఉంది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడో టెస్టు గెలవడం సహా ఆస్ట్రేలియాలో మెరుగ్గా రాణిస్తేనే టైటిల్ పోరుకు అర్హత సాధించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
కివీస్ జట్టుతో ఆఖరిదైన మూడో టెస్టులో తుదిజట్టు ఎంపికపై డీకే తన అభిప్రాయం పంచుకున్నాడు. ముంబైలోని వాంఖడే మైదానంలో జరుగనున్న ఈ మ్యాచ్ నుంచి ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు విరామం ఇవ్వాలని మేనేజ్‌మెంట్‌కు సూచించాడు. కాగా సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను భారత్ ఇప్పటికే 0-2తో కోల్పోయిన విషయం తెలిసిందే.
ఐదు టెస్టులు ఆడేందుకు ఆసీస్‌కు
ఈ క్రమంలో నవంబరు 1 నుంచి ఆరంభం కానున్న మూడో టెస్టులోనైనా గెలుపొంది పరువు నిలుపుకోవాలని పట్టుదలగా ఉంది. అంతేకాదు.. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరాలంటే టీమిండియాకు ఈ మ్యాచ్ కీలకం. ఎందుకంటే.. డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్‌లో ఆఖరిగా రోహిత్ సేన ఆస్ట్రేలియాతో తలపడనుంది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు ఆసీస్‌కు వెళ్లనుంది.
ఈ నేపథ్యంలో కామెంటేటర్ దినేశ్ కార్తిక్ మాట్లాడుతూ.. ‘‘న్యూజిలాండ్ చేతిలో సిరీస్ పరాజయం తీవ్ర నిరాశను మిగిల్చింది. ఇప్పటికీ నా మెదడు ఈ విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. ఇక నామమాత్రపు మూడో టెస్టులో ప్లేయింగ్ ఎలెవన్ ఉండబోతుందో ఇప్పుడే చెప్పలేం.
బుమ్రా స్థానంలో సిరాజ్ రావాలి
అయితే, నా దృష్టిలో మాత్రం బుమ్రాను తప్పించి మహ్మద్ సిరాజ్‌ను తీసుకురావాలి. ఎందుకంటే.. బుమ్రాకు ఇప్పుడు విశ్రాంతి అత్యవసరం. మిగతవాళ్లందరినీ కొనసాగించడమే మంచిది. గత మ్యాచ్ ఆడిన బ్యాటర్లు లేదా బౌలర్లలో ఒక్కరిని కూడా తప్పించడానికి సరైన కారణం కనిపించడం లేదు. బుమ్రాకు మాత్రం రెస్ట్ కావాలి’’ అని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో ఈ పేస్‌గుర్రానికి బ్రేక్ ఇస్తే మంచిదని డీకే ఈ సందర్భంగా క్రిక్‌బజ్‌తో వ్యాఖ్యానించాడు.
ఇదిలా ఉంటే.. వాంఖడే పిచ్ స్పిన్నర్లకు పూర్తిగా అనుకూలిస్తుందన్న అంచనాల నడుమ టీమిండియా ఒకే ఒక పేసర్‌తో బరిలోకి దిగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, బుమ్రా, సిరాజ్, ఆకాశ్‌దీప్‌లలో ఆ ఒక్కరు ఎవరన్నది శుక్రవారం తేలుతుంది. కాగా కివీస్‌తో బెంగళూరు టెస్టులో మూడు వికెట్లు తీసిన బుమ్రా.. పుణె టెస్టులో మాత్రం ఖాతా తెరవలేదు.
Comments
Please login to add a commentAdd a comment