ముంబై: 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఓటమి తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టని మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోని ఐపీఎల్‌పై ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. ఐపీఎల్‌లో రాణిస్తే వచ్చే టి20 వరల్డ్‌కప్ ఆడే అవకాశాలు కూడా మెరుగయ్యేవి. సెలక్టర్లు కూడా పదే పదే ఇదే విషయాన్ని చెప్పారు. అయితే ఇప్పుడు కరోనా కారణంగా ఐపీఎల్ జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మళ్లీ భారత జట్టుకు ఆడాలనే అతని కోరిక నెరవేరకపోవచ్చని ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే అభిప్రాయపడ్డాడు. ఇక జాతీయ జట్టు తరఫున అతని కెరీర్ ముగిసినట్లేనని అతను వ్యాఖ్యానించాడు.
‘ప్రస్తుతం ధోని ఆలోచనలు ఎలా ఉన్నాయో మనమే కాదు అతని నీడ కూడా చెప్పలేదు. అయితే టెస్టులకు గుడ్‌బై చెప్పినప్పుడు, కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పుడు ఎలా వ్యవహరించాడో ఇప్పుడూ అదే చేస్తాడు. భారీ ఆర్భాటపు వీడ్కోలు మ్యాచ్ ఉండదు. ఇది నా గట్టి అభిప్రాయం. అసలు ధోని ఎప్పుడు తప్పుకున్నాడనే విషయం కూడా మనకు తెలీకుండా అతని కెరీర్ ముగిసిపోతుంది. కాబట్టి ప్రస్తుత స్థితిలో అతను భారత జట్టులోకి పునరాగమనం చేయడం కష్టం. ఇంకా ప్రపంచకప్ కోసం నవంబర్ వరకు, ఆ తర్వాతి వరకు వేచిచూసే పరిస్థితి లేదు. ఐపీఎల్ జరగకపోతే ఇక ఏమాత్రం సాధ్యం కాదు’ అని భోగ్లే విశ్లేషించాడు.
Comments
Please login to add a commentAdd a comment