న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానించి ఆ ప్రక్రియ ఇంకా కొనసాగుతుండగానే తన ఓటు రవిశాస్త్రికేనంటూ బహిరంగంగా ప్రకటించిన కెప్టెన్ విరాట్ కోహ్లిపై విమర్శలు వస్తున్నాయి. ఇంకా కోచ్ ఎంపికపై దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో ఇలా మాట్లాడటం తగదని ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే పేర్కొన్నాడు. ‘ ఇలా బహిరంగంగా చెప్పడం ఎంతమాత్రం సరైనది కాదు. దరఖాస్తులకు ఆహ్వానించిన దానికి సంబంధించిన ప్రొసెస్ ఇంకా జరుగుతుండగానే కోచ్ ఎంపికలో ముఖ్య పాత్ర పోషించే వ్యక్తులు ఇలా బహిరంగ ప్రకటనలు చేయడం తగదు’ అని భోగ్లే పేర్కొన్నాడు.
అంతకుముందు కోచ్ ఎంపిక కోసం నియమించబడ్డ క్రికెట్ సలహా కమిటీ(సీఏసీ)లో సభ్యుడైన అన్షుమన్ గైక్వాడ్ కూడా రవిశాస్త్రికే మద్దతు పలికాడు. రవిశాస్త్రి హయాంలో భారత్ అద్భుతమైన విజయాలో సాధించిందంటూ పేర్కొన్నాడు. ఈ రెండు ఘటనలను కోడ్ చేస్తూ హర్షా భోగ్లే ట్వీటర్ వేదికగా స్పందించాడు. (ఇక్కడ చదవండి: రవిశాస్త్రి వైపే మొగ్గు?)
విండీస్ పర్యటనకు బయల్దేరి ముందు మీడియాతో ముచ్చటించిన కోహ్లి.. తనకు రోహిత్‌తో ఎటువంటి విభేదాలు లేవంటూ పేర్కొన్నాడు. జట్టులో అంతా బాగానే ఉందని, రోహిత్ సెంచరీలు సాధించిన క్రమంలో ఎక్కువగా తానే అభినందించానంటూ చెప్పుకొచ్చాడు. అదే సమయంలో ప్రధాన కోచ్ ఎంపిక విషయంలో రవిశాస్త్రికే మద్దతు పలికాడు. ‘కోచ్ ఎంపిక విషయంపై సీఏసీ ఇప్పటి వరకైతే నన్ను ఏమీ అడగలేదు. అయితే నాకు, శాస్త్రికి మధ్య మంచి సమన్వయం ఉంది. ఆయన కోచ్‌గా కొనసాగాలని కోరుకుంటున్నా. నన్ను అభిప్రాయం అడిగితే మాత్రం ఇదే చెబుతా’ అని కోహ్లి స్పష్టం చేసేశాడు.
Comments
Please login to add a commentAdd a comment