యువీ గురించి భార్య కామెంట్.. లైకుల వెల్లువ | Hazel Keech comments in instragam about husband Yuvraj Singh | Sakshi
Sakshi News home page

యువీ గురించి భార్య కామెంట్.. లైకుల వెల్లువ

Published Sat, Jan 21 2017 9:18 AM | Last Updated on Tue, Sep 5 2017 1:46 AM

Hazel Keech comments in instragam about husband Yuvraj Singh

కటక్‌లో జరిగిన రెండో వన్డేలో టీమిండియా సీనియర్ క్రికెటర్ యువరాజ్‌సింగ్ వీరవిహారం గురించి తెలియనివాళ్లు ఉండరు. కేవలం 127 బంతుల్లోనే 150 పరుగులు చేసి విజృంభించిన యువీ.. తన చిరకాల మిత్రుడు ధోనీతో కలిసి బ్రిటిష్ బౌలర్లను చితకబాదేశాడు. రెండు నెలల క్రితమే యువీని పెళ్లి చేసుకున్న హేజిల్ కీచ్ ఈ ఇన్నింగ్స్‌ను చూసి చాలా ముచ్చట పడిపోయారు. ఆమె ఈ విషయమై సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ అందరికీ విపరీతంగా నచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో యువీ బ్యాటింగ్ ఫొటోతో ఆమె పెట్టిన కామెంటుకు ఇప్పటికి 25వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. అతడి మధ్యపేరు 'ఫియర్స్' అయి ఉండాలని హేజిల్ కీచ్ చెప్పారు. తన భర్త ఇప్పుడు ఇంగ్లండ్ పైన, గతంలో కేన్సర్‌పైన చేసిన పోరాటం గురించి ఆమె వివరించారు. 
 
''127 బంతుల్లో 150 పరుగులు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, ఇంగ్లండ్‌పై వన్డే సిరీస్‌లో ఇండియా 2-0 తో గెలిచింది. కేన్సర్‌ను ఓడించి అతడు తిరిగి రావడాన్ని మర్చిపోలేం. మళ్లీ సంపూర్ణ ఆరోగ్యవంతుడై, ఫిట్‌నెస్ సాధించి, కెమోథెరపీ తర్వాత కూడా మళ్లీ వన్డే టీమ్‌లోకి వచ్చాడు. పెళ్లి కూడా చేసుకున్నాడు'' అని ఆమె కామెంట్లో రాశారు. 
 
ఆమె షేర్ చేసిన ఫొటోకు, రాసిన కామెంట్లకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. సామాన్యుడికి ఇది సాధ్యం కాదని, యువరాజ్ మాత్రమే దాన్ని సుసాధ్యం చేసి చూపించాడని ఒకరు అంటే, నిజంగా నిజం హేజిల్.. అతడో హీరో.. అతడికి సెల్యూట్ చేస్తున్నా అని మరో యూజర్ కామెంట్ రాశారు. పలువురు సెలబ్రిటీలు కూడా యువరాజ్ పునరాగమనంతో పాటు బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ఆడటంపై ప్రశంసలు కురిపించారు. బాలీవుడ్ పెద్దాయన అమితాబ్ బచ్చన్, క్రికెటర్లు సచిన్, సెహ్వాగ్, గంగూలీ, హర్భజన్, నటులు రితేష్ దేశ్‌ముఖ్, వరుణ్ ధవన్ తదితరులు యువీ, ధోనీలను ఆకాశానికెత్తేశారు.
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement