సాక్షి, హైదరాబాద్: బ్యాట్స్‌మెన్ రాణించడంతో ఆంధ్రతో జరుగుతోన్న రంజీ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు తొలి రోజు ఓ మోస్తరు స్కోరు చేసింది. ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా విజయనగరం వేదికగా ఆదివారం ప్రారంభమైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆంధ్ర జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 81.4 ఓవర్లలో 7 వికెట్లకు 226 పరుగులు చేసింది. హిమాలయ్ అగర్వాల్ (103 బంతుల్లో 59; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ అక్షత్ రెడ్డి (136 బంతుల్లో 57; 9 ఫోర్లు) అర్ధశతకాలు సాధించగా... తన్మయ్ అగర్వాల్ (53 బంతుల్లో 44; 4 ఫోర్లు, 1 సిక్స్), సందీప్ (33) రాణించారు. ఆంధ్ర బౌలర్లలో శశికాంత్ 3, పృథ్వీ రాజ్, గిరినాథ్ రెడ్డి చెరో 2 వికెట్లు పడగొట్టారు.
తిలక్ వర్మ అరంగేట్రం...
కూచ్ బెహార్ ట్రోఫీలో వరుస సెంచరీలతో విజృంభించిన ఠాకూర్ తిలక్ వర్మ ఈ మ్యాచ్‌తో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలో దిగిన తిలక్ వర్మ (5) ఆకట్టుకోలేకపోయాడు. జట్టు స్కోరు 12 పరుగుల వద్ద శశికాంత్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. మరో ఓపెనర్ తన్మయ్‌తో కలిసి కెప్టెన్ అక్షత్ రెడ్డి ఇన్నింగ్స్ ముందుకు నడిపించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 61 పరుగులు జోడించాక తన్మయ్ వెనుదిరిగాడు. అనంతరం సందీప్‌తో కలిసి మూడో వికెట్‌కు 72 పరుగులు జోడించాడు. ఈ దశలో ఆంధ్ర బౌలర్లు చెలరేగి 2 పరుగుల తేడాలో మూడు వికెట్లు పడగొట్టారు. దీంతో 145/2తో పటిష్టంగా ఉన్న హైదరాబాద్ 146/5తో కష్టాలు కొనితెచ్చుకుంది. రవితేజ (1), చైతన్య (6) విఫలమయ్యారు. చివర్లో హిమాలయ్ ఔటయ్యాడు. ప్రస్తుతం సాయిరామ్ (14 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో అజయ్ దేవ్ గౌడ్ కూడా అరంగేట్రం చేశాడు.
స్కోరు వివరాలు
హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: తన్మయ్ (బి) పృథ్వీరాజ్ 44; తిలక్ వర్మ (బి) శశికాంత్ 5; అక్షత్ రెడ్డి (సి) భరత్ (బి) శశికాంత్ 57; సందీప్ (బి) గిరినాథ్ రెడ్డి 33; హిమాలయ్ (సి) అయ్యప్ప (బి) శశికాంత్ 59; రవితేజ (సి) అశ్విన్ హెబర్ (బి) పృథ్వీరాజ్ 1; చైతన్య (బి) గిరినాథ్ 6; సాయిరామ్ (బ్యాటింగ్) 14; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం: (81.4 ఓవర్లలో 7 వికెట్లకు) 226.
వికెట్ల పతనం: 1–12, 2–73, 3–145, 4–145, 5–146, 6–182, 7–226.
బౌలింగ్: అయ్యప్ప 17–2–56–0, శశికాంత్ 19.4–5–49–3, పృథ్వీరాజ్ 22–9–54–2, గిరినాథ్ రెడ్డి 6–2–7–2, షోయబ్ ఖాన్ 16–1–52–0, సాయికృష్ణ 1–0–8–0.
Comments
Please login to add a commentAdd a comment