సాక్షి, హైదరాబాద్: దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ 2018–19 సీజన్‌లో హైదరాబాద్ ప్రస్థానం ముగిసింది. తొమ్మిది జట్లున్న ఎలైట్ గ్రూప్ ‘బి’లో నిర్ణీత 8 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ 17 పాయింట్లతో పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. ఓ మ్యాచ్‌లో గెలిచి, ఓ మ్యాచ్‌లో ఓడిన హైదరాబాద్ మిగతా ఆరు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది. విజయనగరం వేదికగా ఆంధ్రతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌ను హైదరాబాద్ ‘డ్రా’గా ముగించింది. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన ఆంధ్రకు 3 పాయింట్లు దక్కగా... హైదరాబాద్‌కు 1 పాయింట్ లభించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీ చేసిన ఆంధ్ర బ్యాట్స్‌మన్ శ్రీకర్ భరత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం దక్కింది. ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఆంధ్ర 11 పాయింట్లతో చివరిదైన తొమ్మిదో స్థానంలో ఉంది. ఈనెల 7 నుంచి ఇండోర్‌లో జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌తో ఆంధ్ర ఆడుతుంది. లీగ్ మ్యాచ్‌లు ముగిశాక టాప్–8లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.
మెరిసిన అక్షత్, హిమాలయ్...
ఓవర్‌నైట్ స్కోరు 33/0తో బుధవారం చివరి రోజు ఆట కొనసాగించిన హైదరాబాద్ చివరకు 85 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. కెప్టెన్ అక్షత్ రెడ్డి (98 బంతుల్లో 65; 10 ఫోర్లు, సిక్స్), హిమాలయ్ అగర్వాల్ (93 బంతుల్లో 60; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకాలతో ఆకట్టుకోగా... సందీప్ (45; 5 ఫోర్లు), ఠాకూర్ తిలక్ వర్మ (34; 6 ఫోర్లు) రాణించారు. 64 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో అక్షత్ రెడ్డి, సందీప్ మూడో వికెట్‌కు 84 పరుగులు జోడించారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హిమాలయ్ అగర్వాల్ దూకుడుగా ఆడాడు. ఎడాపెడా బౌండరీలతో స్కోరు పెంచే ప్రయత్నం చేశాడు. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో నిర్ణీత సమయం కంటే ముందే ఆటను నిలిపివేశారు. ఆంధ్ర బౌలర్లలో షోయబ్ ఖాన్‌కు 2 వికెట్లు దక్కాయి.
స్కోరు వివరాలు
హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: 271; ఆంధ్ర తొలి ఇన్నింగ్స్: 502/7 డిక్లేర్డ్; హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్: తన్మయ్ (బి) అయ్యప్ప 18; తిలక్ వర్మ (బి) షోయబ్ ఖాన్ 34; అక్షత్ రెడ్డి (సి) రికీ భుయ్ (బి) షోయబ్ ఖాన్ 65; సందీప్ (సి అండ్ బి) గిరినాథ్ రెడ్డి 45; హిమాలయ్ అగర్వాల్ (నాటౌట్) 60; రవితేజ (సి) భరత్ (బి) పృథ్వీరాజ్ 8; చైతన్య (నాటౌట్) 13; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: (85 ఓవర్లలో 5 వికెట్లకు) 251.
వికెట్ల పతనం: 1–43, 2–64, 3–148, 4–183, 5–210. బౌలింగ్: బండారు అయ్యప్ప 18–5–37–1, శశికాంత్ 18–4–47–0, పృథ్వీరాజ్ 15–6–31–1, షోయబ్ ఖాన్ 18–1–70–2, గిరినాథ్ రెడ్డి 15–2–56–1, ప్రశాంత్ కుమార్ 1–0–5–0.
,,,
Comments
Please login to add a commentAdd a comment