గణేశుడి రూపంలో బీసీసీఐ
జొహన్నెస్‌బర్గ్: గణేశుడి రూపంలో బీసీసీఐ... ఓ చేతిలో క్రికెట్ బ్యాట్... ఇతర చేతుల్లో డబ్బుల కట్టలు... కాళ్ల దగ్గర బలి పీఠంపై క్రికెట్ దక్షిణాఫ్రికా సీఈఓ హరూన్ లోర్గాట్. డబ్బుల కోసం ఆయన్ని బలి ఇస్తున్నట్లుగా సీఎస్‌ఏ బోర్డు పెద్దలు... జొనాథన్ షాపిరో అనే కార్టూనిస్ట్ గీసిన ఓ కార్టూన్... దక్షిణాఫ్రికాలో వివాదానికి దారితీసింది. వివరాళ్లోకి వెళ్తే.... లోర్గాట్‌పై ఆగ్రహంతో సఫారీ టూర్‌ను సందిగ్దంలో పడేసిన బీసీసీఐని.. దక్షిణాఫ్రికా బోర్డు కాళ్లావేళ్లా పడి ఒప్పించుకుంది. చివరకు ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని టూర్‌ను కుదించుకోవడానికి కూడా అంగీకరించింది.
అయితే ఈ మొత్తం వ్యవహారంలో లోర్గాట్‌ను బలి పశువును చేశారు. చివరకు భారత్‌తో క్రికెట్ గురించి అతనికి మాట్లాడే అర్హత లేకుండా చేశారు. ఇదంతా కేవలం బీసీసీఐవిసిరే డబ్బు కట్టల కోసమేనన్నది అక్కడి విమర్శకుల స్పందన. దీంతో బీసీసీఐ, సీఎస్‌ఏల మధ్య ఉన్న సంబంధాలను షాపిరో కార్టూన్ రూపంలో వ్యక్తపరిచారు. ఇది ‘సండే టైమ్స్’లో రావడంతో తమ మనోభావాలను కించపరిచారంటూ హిందూ మతవాద సంస్థల ప్రతినిధులు ఆందోళనకు దిగారు. పత్రిక యాజమాన్యం తక్షణమే క్షమాపణలు చెప్పాలని దక్షిణాఫ్రికా హిందూ ధర్మ సభ (ఎస్‌ఏహెచ్‌డీఎస్), హిందూ మహా సభ, తమిళ సమాఖ్యలు డిమాండ్ చేశాయి.