భళా... భారత్
సెమీస్‌లో సర్దార్‌సేన
క్వార్టర్స్‌లో మలేసియాపై గెలుపు
హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్
యాంట్‌వార్ప్ (బెల్జియం): ఓవైపు తీవ్రమైన ఎండ... మరోవైపు ప్రత్యర్థుల ఎదురుదాడులు... అయినా ఆరంభం నుంచి ఆత్మవిశ్వాసంతో చెలరేగిన భారత జట్టు... హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నీలో దుమ్మురేపింది. బుధవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో భారత్ 3-2 తేడాతో మలేసియాపై గెలిచి సెమీస్‌లోకి దూసుకెళ్లింది. భారత్ తరఫున సత్‌బీర్ సింగ్ (3వ ని.లో), జస్‌జీత్ సింగ్ (50వ, 56వ ని.లో) గోల్స్ చేయగా, రహీమ్ రజీ (15వ ని.లో), సబ్బా షహ్రీల్ (23వ ని.లో) మలేసియాకు గోల్స్ అందించారు. మ్యాచ్ ఆరంభం నుంచే ఇరుజట్లు అటాకింగ్‌కు దిగాయి. తొలి క్వార్టర్‌లో బంతిపై ఆధిపత్యం కోసం తీవ్రంగా పోరాడాయి.
బ్యాక్‌లైన్ నుంచి ఆకాశ్‌దీప్ బంతిని డి-సర్కిల్‌లో అదుపు చేయగా పక్కనే ఉన్న సత్‌బీర్ నేర్పుగా గోల్‌పోస్ట్‌లోకి పంపడంతో భారత్‌కు తొలి గోల్ లభించింది. 4వ నిమిషంలో మలేసియాకు పెనాల్టీ లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. తర్వాత రమణ్‌దీప్, మన్‌ప్రీత్, సర్దార్‌లు అటాకింగ్ చేసినా మలేసియా సమర్థంగా అడ్డుకుంది. మరికొన్ని సెకన్లలో తొలి క్వార్టర్ ముగుస్తుందనగా మలేసియా ప్లేయర్ రజీ గోల్ చేసి స్కోరును 1-1తో సమం చేశాడు.
రెండో క్వార్టర్‌లో భారత్ ఎదురుదాడులు కాస్త గాడి తప్పగా, మలేసియా అద్భుతంగా డిఫెన్స్ చేసింది. మిడ్‌ఫీల్డ్‌లో బంతిని బాగా కంట్రోల్ చేయడంతో 23వ నిమిషంలో నాలుగో పెనాల్టీ లభించింది. దీన్ని షహ్రీల్ గోల్‌గా మల్చడంతో మలేసియా 2-1 ఆధిక్యంలో నిలిచింది. తర్వాతి నిమిషంలోనే భారత్ కౌంటర్ అటాక్‌కు దిగి పీసీని రాబట్టింది. అయితే దీన్ని రూపిందర్ పాల్ వృథా చేశాడు. 28వ నిమిషంలో వాల్మీకి రెండో పెనాల్టీని సాధించినా... రిఫరల్‌లో ఇది వీగిపోయింది.
మూడో క్వార్టర్‌లో స్కోరును సమం చేసేందుకు చేసిన దాడులు ఫలించకపోవడంతో భారత్‌పై ఒత్తిడి పెరిగింది. అయితే 48వ నిమిషంలో పెనాల్టీ రిఫరల్‌లో వీగిపోగా, తర్వాతి నిమిషంలో మరో పీసీ భారత్‌కు లభించింది. దీన్ని జస్‌జీత్ హై ఫ్లిక్‌తో సూపర్బ్‌గా నెట్‌లోకి పంపి భారత్ శిబిరంలో ఆనందం నింపాడు. మరో ఏడు నిమిషాల తర్వాత లభించిన పెనాల్టీని జస్‌జీత్ మళ్లీ గోల్‌గా మలిచి భారత్‌ను 3-2 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు.
ఆట 30 సెకన్లలో ముగుస్తుందనగా మలేసియాకు పెనాల్టీ లభించినా గోల్‌కీపర్ శ్రీజేష్ బంతిని అద్భుతంగా నిలువరించడంతో విజయం భారత్ సొంతమైంది. ఇదే టోర్నీ మహిళల విభాగంలో గురువారం ఇటలీతో భారత జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గితేనే భారత్‌కు రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశాలు సజీవంగా ఉంటాయి.