ఆతిథ్యం... తొమ్మిది దేశాల్లోనే! | Hospitality is four times in Thailand, twice in India | Sakshi
Sakshi News home page

ఆతిథ్యం... తొమ్మిది దేశాల్లోనే!

Aug 10 2018 12:55 AM | Updated on Aug 10 2018 7:46 AM

Hospitality is four times in Thailand, twice in India - Sakshi

అతిపెద్ద ఖండంలోకెల్లా భారీ టోర్నీ..ఆరు దశాబ్దాలపైగా నిర్వహణ...ఏకంగా 45 దేశాల ప్రాతినిధ్యం...ఆతిథ్యం ఇచ్చింది మాత్రం తొమ్మిదే...!రాబోయే రెండు టోర్నీలూ వీటిలోనే! ...ఇదీ ఆసియాడ్‌ వేదికల కథ!

సాక్షి క్రీడా విభాగం: థాయ్‌లాండ్‌...ఆసియా క్రీడలు! రెండింటిది ఓ ప్రత్యేకమైన కథ. సభ్య దేశాల్లో మరేదానికీ సాధ్యం కానట్లు ఏకంగా నాలుగుసార్లు వేదికగా నిలిచిందీ చిన్న దేశం. విస్తీర్ణంలో, జనాభాలో పెద్దవైన చైనా, భారత్, ఇండోనేసియా కంటే, ఆర్థిక ప్రగతిలో ముందున్న జపాన్, దక్షిణ కొరియా సైతం ఇన్నిసార్లు నిర్వహించ లేకపోవడం గమనార్హం. చిత్రమేమంటే, భారత్‌లోనే (1951) ప్రారంభమైన ఈ క్రీడలకు మనం ఆతిథ్యం ఇచ్చింది మాత్రం రెండుసార్లే. చివరిగా 1982లో రెండోసారీ ఢిల్లీలోనే జరిగాయి. 

థాయ్‌ ముద్ర 
చర్రితలో ఏ మెగా టోర్నీని ఒకే దేశం వరుసగా రెండుసార్లు నిర్వహించలేదు. థాయ్‌లాండ్‌ మాత్రం ఆసియాడ్‌తో ఆ ఘనత సాధించింది. అంతేకాదు, 1966–78 మధ్య ఏకంగా మూడుసార్లు ఆతిథ్యం ఇచ్చి రికార్డుల్లోకి ఎక్కింది. ఇతర దేశాలు తమవల్ల కాదని చేతులెత్తేసిన సందర్భాల్లో థాయ్‌లాండ్‌ ముందుకు రావడమే ఇందుకు కారణం. 1966లో తొలిసారిగా, 1970లో దక్షిణ కొరియా నిస్సహాయతతో, 1978లో పాకిస్తాన్‌ తప్పుకోవడంతో థాయ్‌లాండ్‌ వేదికగా మారింది. 1998లో సొంత బిడ్‌తో పోటీలు నిర్వహించింది. 

కొరియా మూడు... చైనా, జపాన్‌ రెండు 
1970లో భద్రతా కారణాలతో వీలుకాదన్న దక్షిణ కొరియా 1986, 2002, 2014లో టోర్నీని నిర్వహించింది. థాయ్‌లాండ్‌ తర్వాత ఎక్కువ సార్లు వేదికగా నిలిచింది. అయితే, చాలా ఆలస్యంగా 1974లో ఆసియాడ్‌లో అడుగిడిన చైనా తర్వాత పదహారేళ్లకే ఆతిథ్యం ఇచ్చింది. 2010లో మరోసారి పోటీలు ఇక్కడ జరిగాయి. జపాన్‌ 1958లోనే తమదగ్గర టోర్నీని నిర్వహించింది. మళ్లీ 1994లో... అణుబాంబు బాధిత హిరోషిమాలో ఆడించి ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చింది. దేశ రాజధానిలో కాకుండా వేరే నగరంలో ఆసియాడ్‌ జరగడం ఇదే తొలిసారి కావడం మరో విశేషం. ఈ జాబితాలో బుసాన్‌ (2002), గాంగ్జు (2010), ఇంచియాన్‌ (2014) తర్వాత చేరాయి. ఇరాన్, ఖతార్, ఫిలిప్పీన్స్‌లలో ఒక్కోసారి ఆసియాడ్‌ జరగ్గా... ప్రస్తుతం ఇండోనేసియా రెండోసారి వేదిక కానుంది. రెండు (జకార్తా, పాలెంబాంగ్‌) నగరాల్లో జరుగనుండటం మాత్రం ఇప్పుడే కావడం గమనార్హం.  

పతకాల పట్టికలో ఆ రెండే... 
ఆసియాడ్‌ పతకాల పట్టికలో 1978 వరకు జపాన్, తర్వాత నుంచి చైనాలదే అగ్రస్థానం. మరే దేశమూ వీటిని అధిగమించలేకపోతోంది. ఇప్పటివరకు చైనా ఏకంగా 1,342 స్వర్ణాలు గెల్చుకుని తన ఆధిపత్యం చాటింది. 957 స్వర్ణాలతో జపాన్‌ దాని వెనుక ఉంది. ఈ జాబితాలో భారత్‌ (139)... దక్షిణ కొరియా (696), ఇరాన్‌ (159), కజకిస్తాన్‌ (140) తర్వాత ఉంది.

►2 జపాన్, భారత్‌ మాత్రమే ప్రతి ఆసియాడ్‌లోనూ బంగారు పతకాలను గెల్చుకున్నాయి. 

►3 భూటాన్, మాల్దీవులు, తైమూర్‌ మాత్రమే టోర్నీలో ఇప్పటివరకు ఒక్క పతకమూ గెలవని దేశాలు. 37 దేశాలు కనీసం కనీసం ఒక్క బంగారు పతకాన్నైనా సాధించాయి. 

►7ఇప్పటివరకు జరిగిన అన్ని ఆసియాడ్‌లలో పాల్గొన్న దేశాలు భారత్, ఇండోనేసియా,ఫిలిప్పీన్స్, జపాన్,  శ్రీలంక, సింగపూర్, థాయ్‌లాండ్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement