ఆర్టీడబ్ల్యూ కోసం శివాని, హుమేర
సాక్షి, హైదరాబాద్: ఇంగ్లండ్‌లో జరిగే ‘రోడ్ టు వింబుల్డన్’ (ఆర్టీడబ్ల్యూ) జాతీయ టోర్నీ కోసం భారత్‌లో నిర్వహించే క్వాలిఫయింగ్ టోర్నీలో తెలంగాణ, ఏపీలకు చెందిన 12 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. ఇందులో హైదరాబాద్ అమ్మాయిలు శివాని అమినేని, షేక్ హుమేరా బేగం చోటు దక్కించుకున్నారు. వీరితో పాటు బాలికల జట్టులో సాయి దేదీప్య, ధరణ ఆనంద్, శ్రీవల్లి రష్మిక, రచనా రెడ్డి ఉన్నారు. బాలుర జట్టులో రిత్విక్ చౌదరి, తీర్థ శశాంక్, మెంగా రోహిత్, ఆశిష్ నంద్, ఆకాశ్ రెడ్డి, శ్రీహర్షిత్ ఎంపికయ్యారు.
తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన బాలబాలికల జట్లు అలిండియా టెన్నిస్ సంఘం (ఐటా) నిర్వహించే క్వాలిఫయింగ్ ఈవెంట్లలో పోటీపడతాయి. మొత్తం నాలుగు నగరాల్లో ఈ పోటీలు నిర్వహించనున్నారు. ఈనెల 12న కోల్‌కతాలో, 19న చండీగఢ్‌లో, ఫిబ్రవరి 2న ఢిల్లీలో, 9న ముంబైలో ఈ పోటీలు జరుగుతాయి. అనంతరం ఢిల్లీలో ఏప్రిల్ 6న జరిగే ఫైనల్ ఈవెంట్‌లో గెలుపొందిన విజేతలను రోడ్ టు వింబుల్డన్ జాతీయ మాస్టర్స్ టోర్నీకి ఎంపిక చేస్తారు. ఈ ఈవెంట్ ఇంగ్లండ్‌లో ఆగస్టులో జరగనుంది.