ధోని కెప్టెన్సీని గౌరవిస్తా: రహానే
న్యూఢిల్లీ: తనదైన శైలిలో జట్టును నడిపిస్తానని జింబాబ్వే పర్యటనకు టీమిండియా కెప్టెన్ గా ఎంపికైన అజింక్య రహానే తెలిపాడు. తన వ్యూహాలు అనుసరిస్తానని చెప్పాడు. కెప్టెన్ గా నియమితుడైన తర్వాత రహానే తొలిసారిగా సోమవారం విలేకరులతో మాట్లాడాడు. ధోని నాయకత్వ లక్షణాలను గౌరవిస్తానని, వాటి నుంచి నేర్చుకునేందుకు ప్రయత్నిస్తానని అన్నాడు. ధోని శాంతగుణం తనకెంతో నచ్చుతుందని చెప్పాడు.
వన్డేలోకి హర్భజన్ సింగ్ పునరాగమనంపై రహానే సంతోషం వ్యక్తం చేశాడు. జింబాబ్వే పర్యటనకు నాలుగు రోజుల ముందు టీమిండియాకు దెబ్బ తగిలింది. చేతివేలి గాయం కారణంగా లెగ్ స్పిన్నర్ కర్ణ్ శర్మ జట్టుకు దూరమయ్యాడు. ఈ నెల 10 నంచి ప్రారంభంకానున్న జింబాబ్వే టూరులో టీమిండియా 3 వన్డేలు, రెండు టీ20 మ్యాచ్ లు ఆడనుంది.