
మూడు ఫార్మాట్లు ఆడే సత్తా ఉంది
గ్రేటర్ నోయిడా: భారత జట్టులోకి తిరిగి వస్తానని, మూడు ఫార్మాట్లు ఆడే సత్తా తనలో ఉందని భారత స్టార్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ తెలిపాడు. తన పేరిట క్రికెట్ అకాడమీని ప్రారంభించేందుకు ఇక్కడికి వచ్చిన అతను మాట్లాడుతూ ‘నా వయస్సు 32 సంవత్సరాలే. కుర్రాళ్లతో పోటీపడి ఆడగలను. దేశవాళీ క్రికెట్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రాక్టీస్‌లో కఠోరంగా చెమటోడ్చాను. ఫస్ట్‌క్లాస్ సీజన్‌కు ముందు కొన్ని స్థానిక టోర్నీల్లో ఆడాలనుకుంటున్నా. మొత్తం మీద తిరిగి జట్టులోకి వచ్చే పనిలో ఉన్నా’ అని చెప్పాడు.
సీనియర్ల గైర్హాజరీలో కుర్రాళ్లు బాగా ఆడుతున్నారని కితాబిచ్చాడు. వాళ్లకు విరివిగా అవకాశాలు వస్తున్నాయని, దీన్ని కుర్రాళ్లు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని చెప్పాడు. ప్రస్తుతం భారత పేస్ బౌలింగ్ విభాగం బాగా మెరుగుపడిందని, ప్రత్యామ్నాయాలు ఎక్కువగా ఉన్నాయని అన్నాడు. తను క్రికెట్ నేర్చుకునే రోజుల్లో ఒక్కో చోట ఒక్కో సదుపాయం ఉండేదని... ఇప్పుడు క్రికెట్ ప్రాక్టీస్, జిమ్, స్విమ్మింగ్ అంతా ఒకే అకాడమీలో ఉండటం వర్ధమాన ఆటగాళ్లకు మేలు చేస్తుందన్నాడు.