న్యూఢిల్లీ:మూడు టీ 20ల సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ తో సొంతమైదానం ఫిరోజ్ షా కోట్లలో జరిగిన మొదటి మ్యాచ్ ద్వారా తన అంతర్జాతీయ క్రికెట్ కు టీమిండియా వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఈ తన నిర్ణయాన్ని ఆస్ట్రేలియాతో జరిగిన టీ 20సిరీస్ లోనే ప్రకటించిన నెహ్రా.. అన్నట్లుగానే కివీస్ తో బుధవారం జరిగిన మ్యాచ్ ద్వారా కెరీర్ కు ముగింపు పలికాడు. అయితే, న్యూజిలాండ్ తో టీ 20 సిరీస్ కు సెలక్టర్ల నిర్ణయాన్ని ముందుగానే తీసుకుని వీడ్కోలు పలికారా అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు నెహ్రా ఘాటుగా స్పందించాడు. ఈ మేరకు న్యూజిలాండ్ తో సిరీస్ కు నెహ్రాను పరిగణలోకి తీసుకోవడం లేదంటూ చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ వ్యాఖ్యానించినట్లు వచ్చిన వార్తలపై కూడా నెహ్రా అసహనం వ్యక్తం చేశాడు.
'నేను సెలక్టర్ల అనుమతితో క్రికెట్ ఆడటం ప్రారంభించలేదు. అటువంటప్పుడు సెలక్టర్ల అనుమతితో వీడ్కోలు ఎందుకు చెబుతాను. మరి ఎంఎస్కే ప్రసాద్ అలా వ్యాఖ్యానించినట్లు నాకు తెలియదు. ఆ విషయాన్ని నాకైతే ఎంఎస్కే చెప్పలేదు. మీరు మాత్రమే నన్ను ఆ ప్రశ్న అడుగుతున్నారు. నా వీడ్కోలుపై నేను కేవలం జట్టు మేనేజ్ మెంట్ తో మాత్రమే చర్చించాను. ఇటీవల ముగిసిన ఆసీస్ తో సిరీస్ లో భాగంగా నేను రాంచీకి వచ్చినప్పుడు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లికి నా ప్లాన్ ను చెప్పా. మొత్తం క్రికెట్ కు వీడ్కోలు చెబుదామని అనుకుంటున్నట్లు స్పష్టం చేశా. కోహ్లి ఆశ్చర్యపోయాడు. ఐపీఎల్లో ఆడే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు క్రికెట్ నుంచి మొత్తంగా గుడ్ బై చెప్పడమని అడిగాడు. ఆ క్రమంలోనే ఐపీఎల్లో ఆటగాడిగా కోచ్ గా ఉంటూ కెరీర్ ను కొనసాగించవచ్చు కదా అన్నాడు. నేను మొత్తంగా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు విరాట్ కు తెలిపా. ఇది మాత్రమే జరిగింది. నా వీడ్కోలు గురించి ఎన్నిసార్లు అడిగినా ఇదే చెబుతా. అది కివీస్ తో సిరీస్ కు ఢిల్లీ మ్యాచ్ ద్వారా కుదిరింది. అంతేకానీ నాకు వీడ్కోలు మ్యాచ్ ఏర్పాటు చేయమని ఎవర్నీ అడగలేదు. నేను సెలక్టర్ల అనుమతితో ఫేర్ వెల్ మ్యాచ్ ను ఏర్పాటు చేయించుకోలేదు. నేను తీసుకునే నిర్ణయంలో విరాట్, కోచ్ రవిశాస్త్రి, జట్టు మేనేజ్ మెంట్ పాత్ర మాత్రమే ఉంది. సెలక్టర్ల పాత్ర ఇక్కడ ఎంతమాత్రం లేదు' అని నెహ్రా పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment