
అంబటి రాయుడికి విరాట్ చిట్కా..
జింబాబ్వేపై తొలి వన్డేలో రాయుడు చాలా పరిణతి చెందిన ఇన్నింగ్స్ ఆడాడు.
జింబాబ్వేపై తొలి వన్డేలో రాయుడు చాలా పరిణతి చెందిన ఇన్నింగ్స్ ఆడాడు. నిజానికి రెండేళ్లుగా జట్టుతో పాటే ఉంటున్నా తనకి వచ్చిన అవకాశాల సంఖ్య తక్కువ. సీనియర్లందరూ ఉంటే తుది జట్టులో రాయుడికి అవకాశం రావడం చాలా కష్టమైన పరిస్థితి. ప్రపంచకప్ అంతటా జట్టుతో పాటే తిరిగినా పాపం ఒక్క మ్యాచ్ ఆడలేదు. ఇలా బెంచ్‌పై కూర్చోవడం ఏ ఆటగాడికైనా కష్టమే. అయితే అలాంటి సమయంలో నిరాశ చెందకుండా ఉండటానికి రాయుడికి కోహ్లి ఒక చిట్కా నేర్పాడట.
‘మ్యాచ్ జరుగుతున్నప్పుడు నేను బయట ఉంటే... నేనే క్రీజులో ఉన్న బ్యాట్స్‌మన్ స్థానంలో ఆడుతున్నట్లు ఊహించుకుంటా. అలాంటి పరిస్థితిలో బ్యాట్స్‌మన్ ఆడుతున్న బంతిని నేనైతే ఎలా ఆడతానో అంచనా వేసుకుంటూ మ్యాచ్ చూస్తా. దీనివల్ల మ్యాచ్‌లో పూర్తిగా ఇన్‌వాల్వ్ అయిపోవచ్చు. మానసికంగా మ్యాచ్ ఆడినట్లే భావించవచ్చు. కాబట్టి ఎక్కువ అవకాశాలు రాకుండా బెంచ్‌పై కూర్చున్నా నిరాశగా అనిపించదు. ఈ చిట్కా నాకు కోహ్లి నేర్పించాడు’ అని రాయుడు చెప్పాడు. ఆటపై నియంత్రణ ఎలా తెచ్చుకోవాలో ధోనిని చూసి నేర్చుకున్నానని ఈ హైదరాబాదీ తెలిపాడు.