
ఫ్యాషన్ అంటే ఇష్టమే
ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేసిన సానియా మీర్జా
న్యూఢిల్లీ: ధవళ కాంతులతో తనుకులీనుతున్న అనార్కలి చుడీదార్... దానిపై బంగారు రంగుతో చూడ చక్కని డిజైన్... చెవులకు జుమ్కీలు... చేతికి అందమైన రిస్ట్ వాచ్... నల్లగా నిగనిగలాడుతున్న కురులు... ర్యాంప్‌పై క్యాట్ వాక్... శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన విల్స్ లైఫ్ స్టయిల్ ఇండియా ఫ్యాషన్ వీక్‌లో పాల్గొన్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వస్త్రధారణ ఇది. డిజైనర్ రీతూ పాండే రూపొందించిన ఈ స్లీవ్‌లెస్ డ్రెస్‌లో హైదరాబాద్ అమ్మాయి... తన అందంతో చూపరులను కట్టిపడేసింది.
చీరలు, ప్యాంట్లు, ధోతీలు... ఇలా రకరకాల డిజైన్ దుస్తులతో ర్యాంప్‌పై హొయలు ఒలికించిన మోడల్స్‌తో కలిసి సానియా తన ప్రత్యేకతను చాటుకుంది. ఫ్యాషన్ అంటే తనకు ఇష్టమని ఈ సందర్భంగా టెన్నిస్ స్టార్ చెప్పింది. ‘ర్యాంప్‌పై వాక్ చేసేటప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. మన జీవితాల్లో ఫ్యాషన్ కూడా ఓ భాగం. నాకు అనుకూలంగా ఉంటే టీషర్ట్‌లు, జీన్స్, జాకెట్స్‌ను ధరిస్తుంటాను.
నడుముపైకి వచ్చే దుస్తులు, మోకాలి వరకు ఉండే స్కర్టులంటే కూడా నాకు ఇష్టమే’ అని షో తర్వాత సానియా వ్యాఖ్యానించింది. దుస్తులకు కొత్త అందాన్నిచ్చే టెక్నిక్‌లను వాడి వీటిని రూపొందించినట్లు డిజైనర్ పాండే తెలిపింది.