గేల్ ను అవుట్ చేయడానికి వార్నర్ ఏం చెప్పాడు?
బెంగళూరు: ఐపీఎల్-9లో అత్యధిక వికెట్లు పడగొట్టిన తమ బౌలర్ భువనేశ్వర్ కుమార్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ప్రశంసలు కురిపించాడు. అతడు ప్రపంచస్థాయి బౌలర్ అని మెచ్చుకున్నాడు. అతడి బౌలింగ్ తో ప్రత్యర్ధి టీమ్స్ బ్యాట్స్ మన్ తిప్పలు తప్పవని అన్నాడు. కొత్త బంతితో భువీ అద్భుతాలు చేస్తాడని, అందుకే అతడిపై పూర్తి విశ్వాసం కనబరిచినట్టు చెప్పాడు.
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత మాట్లాడుతూ... తన నమ్మకాన్ని భువనేశ్వర్ వమ్ము చేయలేదని అన్నాడు. భవిష్యత్ లో అతడు మరింత రాణిస్తాడని అభిప్రాయపడ్డాడు. ముస్తాఫిజుర్ కూడా బాగా బౌలింగ్ చేశాడని తెలిపాడు. భువీతో కలిసి అతడు విజృభించాడని పేర్కొన్నాడు.
విధ్వంసకర ఓపెనర్ క్రిస్ గేల్ ను అవుట్ చేయడానికి వైడ్, స్లో బంతులు వేయాలని తమ బౌలర్లకు చెప్పినట్టు వార్నర్ వెల్లడించాడు. ఎలా బౌలింగ్ చేసినప్పటికీ గేల్ విరుచుకుపడ్డాడని అన్నాడు. తొందరగా వికెట్లు తీస్తే తర్వాత వచ్చే బ్యాట్స్ మన్ షాట్లు ఆడడానికి కష్టపడాల్సి వుంటుందన్న ఉద్దేశంతో వ్యూహం రచించామని చెప్పాడు.