బాబర్‌ ఆజం ప్రపంచ రికార్డు | Babar Azam Breaks Chris Gayle World Record Becomes Fastest Batter In World To Score 11,000 Runs, Check More Insights | Sakshi
Sakshi News home page

క్రిస్‌ గేల్‌ ప్రపంచ రికార్డు బ్రేక్‌.. బాబర్‌ ఆజం సరికొత్త చరిత్ర

Published Sat, Dec 14 2024 2:02 PM | Last Updated on Sat, Dec 14 2024 2:52 PM

Babar Azam Breaks Gayle World Record Becomes Fastest Batter To

టీ20 క్రికెట్‌ పాకిస్తాన్‌ స్టార్‌ బ్యాటర్‌ బాబర్‌ ఆజం సరికొత్త చరిత్ర సృష్టించాడు. పొట్టి ఫార్మాట్లో అత్యంత వేగంగా పదకొండు వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ క్రమంలో యూనివర్సల్‌ బాస్‌, వెస్టిండీస్‌ విధ్వంసకర వీరుడు క్రిస్‌ గేల్‌ను అధిగమించి.. ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

పాక్‌కు చేదు అనుభవం
సౌతాఫ్రికాతో రెండో టీ20 సందర్భంగా బాబర్‌ ఆజం ఈ ఘనత సాధించాడు. కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టులు ఆడేందుకు పాకిస్తాన్‌ సౌతాఫ్రికా టూర్‌కు వెళ్లింది. ఈ పర్యటన టీ20 సిరీస్‌తో మొదలుకగా.. పాక్‌కు చేదు అనుభవం ఎదురైంది.

డర్బన్‌లో జరిగిన తొలి టీ20లో ఆతిథ్య ప్రొటీస్‌ జట్టు చేతిలో 11 పరుగుల తేడాతో ఓడిన పాకిస్తాన్‌.. సెంచూరియన్‌లో శుక్రవారం నాటి రెండో మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది. సౌతాఫ్రికా చేతిలో ఏడు వికెట్ల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ టీ20లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసింది పాక్‌.

సయీమ్‌ ఆయుబ్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌ వృథా
ఓపెనర్‌ సయీమ్‌ ఆయుబ్‌(57 బంతుల్లో 98 నాటౌట్‌) ధనాధన్‌ ఇన్నింగ్స్‌కు తోడు.. బాబర్‌ ఆజం(20 బంతుల్లో 31), ఇర్ఫాన్‌ ఖాన్‌(16 బంతుల్లో 30) రాణించడంతో భారీ స్కోరు సాధించింది. అయితే, సౌతాఫ్రికా బ్యాటర్లలో రీజా హెండ్రిక్స్‌ సూపర్‌ సెంచరీ(63 బంతుల్లో 117), రాసీ వాన్‌ డెర్‌ డసెన్‌(38 బంతుల్లో 66) అద్భుత అర్ధ శతకం కారణంగా పాక్‌కు ఓటమి తప్పలేదు.

ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ బాబర్‌ ఆజం స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. ఘనంగా(31, 3 ఫోర్లు, ఒక సిక్సర్‌)నే ఇన్నింగ్స్‌ను ఆరంభించినా.. దానిని భారీ స్కోరుగా మలుచుకోలేకపోయాడు. అయినప్పటికీ  పొట్టి ఫార్మాట్లో అతడు అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు.

గేల్‌ ప్రపంచ రికార్డును బద్దలు
సౌతాఫ్రికాతో రెండో టీ20 సందర్భంగా బాబర్‌ ఆజం షార్టెస్ట్‌ క్రికెట్‌లో ఓవరాల్‌గా 11,020 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో గేల్‌ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలుకొట్టాడు. 

పదకొండు వేల పరుగుల మార్కును అందుకోవడానికి గేల్‌కు 314 ఇన్నింగ్స్‌ అవసరమైతే.. బాబర్‌ 298 ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్‌ అందుకున్నాడు. అయితే, ఓవరాల్‌గా మాత్రం అంతర్జాతీయ, ఫ్రాంఛైజీ టీ20 క్రికెట్‌లో గేల్‌ యూనివర్సల్‌ బాస్‌గా కొనసాగుతున్నాడు. అతడి ఖాతాలో 14562 టీ20 రన్స్‌ ఉన్నాయి.

టీ20 క్రికెట్‌లో తక్కువ ఇన్నింగ్స్‌లో 11000 పరుగులు సాధించిన ఆటగాళ్లు
1. బాబర్‌ ఆజం- 298 ఇన్నింగ్స్‌
2. క్రిస్‌ గేల్‌- 314 ఇన్నింగ్స్‌
3. డేవిడ్‌ వార్నర్‌- 330 ఇన్నింగ్స్‌
4. విరాట్‌ కోహ్లి- 337 ఇన్నింగ్స్‌.

చదవండి: ఫాస్టెస్ట్‌ సెంచరీ.. వెస్టిండీస్‌ బ్యాటర్‌ ప్రపంచ రికార్డు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement