
విండీస్ ఆటగాళ్లపై ఐసీసీ ఆగ్రహం!
ఇటీవల భారత్లో జరిగిన వరల్డ్ టీ 20 కప్ను గెలిచిన అనంతరం వెస్టిండీస్ క్రికెట్ జట్టులోని పలువురు ఆటగాళ్లు తమ క్రికెట్ బోర్డును విమర్శించడం పట్ల అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది.
దుబాయ్:ఇటీవల వరల్డ్ టీ 20 కప్ను గెలిచిన అనంతరం వెస్టిండీస్ క్రికెట్ జట్టులోని పలువురు ఆటగాళ్లు ఆ దేశ క్రికెట్ బోర్డును విమర్శించడం పట్ల అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సమయంలో కొంతమంది ఆటగాళ్లు మీడియా ముందు శృతిమించి మాట్లాడాన్ని తప్పుబట్టిన ఐసీసీ.. అది బాధ్యతరాహిత్యమైన చర్యగా అభివర్ణించింది. దుబాయ్లోని ఐసీసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో విండీస్ క్రికెటర్ల అంశం చర్చకు వచ్చింది. పురుషుల, మహిళల వరల్డ్ కప్ లతో పాటు, ఫిబ్రవరిలో జరిగిన అండర్ -19 వరల్డ్ కప్ ను కూడా విండీస్ కైవసం చేసుకోవడంతో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు(డబ్యూఐసీబీ)కు ఐసీసీ అభినందనలు తెలియజేసింది. ఇలా ఒక దేశం మూడు ఈవెంట్లలో కప్ గెలవడం నిజంగా అద్భుతమని కొనియాడింది. మరోవైపు విండీస్ పురుషుల జట్టులోని ఆటగాళ్ల క్రికెట్ బోర్డును బహిరంగంగా విమర్శించడాన్ని తీవ్రంగా పరిగణించింది.
ఒక మెగా టోర్నమెంట్లో ఆటగాళ్లు అలా అమర్యాదగా ప్రవర్తించడం కచ్చితంగా ఐసీసీ కోడ్లోని నిబంధల్ని అతిక్రమించడమేనని పేర్కొంది. ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారో వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది. దీంతో పాటు ఫైనల్లో విండీస్ విజయం సాధించిన అనంతరం ఇంగ్లండ్ బౌలర్ బెన్ స్టోక్స్ ను నాన్ స్టైయికర్ ఎండ్లో ఉన్న మార్లోన్ శామ్యూల్స్ దూషించడాన్ని ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ తప్పుబట్టారు. శామ్యూల్స్ క్రీడా స్ఫూర్తిని దాటి ప్రవర్తించడం సరైన విధానం కాదన్నారు.