
‘టాప్’ను నిలబెట్టుకున్న భారత్
విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత టెస్టు క్రికెట్ జట్టు ప్రపంచ నెం. 1 ర్యాంకును నిలబెట్టుకుంది.
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్
దుబాయ్: విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత టెస్టు క్రికెట్ జట్టు ప్రపంచ నెం. 1 ర్యాంకును నిలబెట్టుకుంది. తాజాగా ఐసీసీ ప్రకటించిన జాబితా ప్రకారం ప్రస్తుతం 123 పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. గత కొంతకాలంగా టెస్టుల్లో అద్వితీయ విజయాలను సాధిస్తో న్న టీమిండియా టెస్టు నెంబర్ 1 జట్టుగా నిలిచి ఇటీవలే గదతో పాటు మిలియన్ డాలర్ల నగదు పురస్కారాన్ని కూడా అందుకుంది. అయితే 2014–16 మధ్యలో జట్ల ప్రదర్శన ఆధారంగా గురువారం ఐసీసీ విడుదల చేసిన ర్యాంకుల్లోనూ కోహ్లిసేన అగ్రస్థానంలోనే కొనసాగుతోంది.
తాజా జాబితా ప్రకారం భారత్ ఒక పాయింట్‌ను సాధించి 123 పాయింట్లకు చేరుకోగా... రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా ఆరు పాయింట్లు మెరుగుపరుచుకొని 117 పాయింట్లతో ఉంది. ఆస్ట్రేలియా (100), ఇంగ్లండ్ (99), న్యూజిలాండ్ వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాత పాకిస్థాన్ (93), శ్రీలంక (91), వెస్టిండీస్ (75), బంగ్లాదేశ్ (69), జింబాబ్వే జట్లు ఉన్నాయి.