సమ ఉజ్జీల సమరం
టి20 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్ నేడు
శ్రీలంకతో వెస్టిండీస్ ఢీ
‘స్పిన్’పైనే ఇరు జట్ల ఆశలు
క్రికెట్ ప్రేమికులకు ఇంతకంటే మంచి వినోదం దొరకదేమో..! టి20ల్లో ఆరితేరిన క్రికెటర్లతో నిండిన రెండు జట్ల మధ్య ప్రపంచకప్ సెమీఫైనల్‌ను మించిన మ్యాచ్ ఎక్కడ దొరుకుతుంది? రెండు జట్లలోనూ హిట్టర్స్... ఇరు జట్లలోనూ నాణ్యమైన స్పిన్నర్స్... వెరసి ఓ హోరాహోరీ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌తో... గత ఏడాది ఫైనలిస్ట్ శ్రీలంక తలపడుతుంది.
సా. గం. 6.30 నుంచి
స్టార్‌స్పోర్ట్స్-1లో
ప్రత్యక్ష ప్రసారం
(ఢాకా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి)
గత టి20 ప్రపంచకప్‌లో ఫైనల్లో తలపడ్డ రెండు జట్ల మధ్య ఈసారి తొలి సెమీఫైనల్ జరగబోతోంది. నాటి ఫైనల్‌తో పాటు... ఈ సారి టోర్నీకి ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ లంకపై వెస్టిండీస్‌దే పైచేయి. మరి రెండేళ్ల క్రితం స్వదేశంలో ఎదురైన పరాభవానికి శ్రీలంక ఈసారి ప్రతీకారం తీర్చుకుంటుందా? లేక వెస్టిండీస్ మరోసారి ఆధిపత్యం నిలబెట్టుకుంటుందా..? ఈ ప్రశ్నలకు సమాధానం షేరే బంగ్లా స్టేడియంలో గురువారం జరిగే తొలి సెమీస్ ద్వారా తేలనుంది.
బలాల పరంగా ఇటు శ్రీలంక, అటు వెస్టిండీస్ ఒకేలా కనిపిస్తున్నాయి. ఇరు జట్ల బ్యాట్స్‌మెన్‌కు టి20ల్లో కావలసినంత అనుభవం ఉండటం.. రెండు జట్లలోనూ అద్భుతమైన బౌలర్లు ఉండటంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే శ్రీలంక తమ లీగ్ మ్యాచ్‌లన్నీ చిట్టగాంగ్‌లో ఆడి తొలిసారి ఢాకాలో మ్యాచ్ ఆడబోతోంది. మరోవైపు వెస్టిండీస్ తమ మ్యాచ్‌లన్నీ ఇదే స్టేడియంలో ఆడింది.
బౌలర్లపైనే ఆశలు
టోర్నీలో శ్రీలంకకు ఓపెనర్లు కుషాల్ పెరీరా, దిల్షాన్ ఇప్పటిదాకా మంచి ఆరంభాలే ఇచ్చారు. సంగక్కర 4 మ్యాచ్‌లలో కేవలం 18 పరుగులు మాత్రమే చేయడం ఆందోళనకరమే అయినా అప్పటికప్పుడు మ్యాచ్ ఫలితాన్ని మార్చగల సత్తా సంగక్కర సొంతం. ఇక జయవర్ధనే మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఒక మ్యాచ్ నిషేధం కారణంగా న్యూజిలాండ్‌తో ఆఖరి మ్యాచ్‌కు దూరమైన కెప్టెన్ చండీమల్ తిరిగి మైదానంలోకి దిగనున్నాడు. తిషార పెరీరా, మాథ్యూస్‌లాంటి హిట్టర్‌లతో లంక బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది.
ఇక బౌలింగ్‌లో మలింగ, కులశేఖర రూపంలో ఇద్దరు ప్రపంచస్థాయి స్పిన్నర్లు ఉన్నారు. అందరి దృష్టీ మలింగపై ఉన్నా... కులశేఖర టోర్నీలో ఇప్పటివరకూ పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఇక స్పిన్నర్లుగా సేనానాయకే, హెరాత్ బరిలోకి దిగుతారు. సేనానాయకే ప్రతి మ్యాచ్‌లోనూ పొదపుగా బౌలింగ్ చేయగా.. హెరాత్ ఆడిన ఒక్క మ్యాచ్‌లోనే న్యూజిలాండ్‌పై 3 పరుగులకే ఐదు వికెట్లతో సంచలనం సృష్టించాడు. వెస్టిండీస్ బ్యాటింగ్ లైనప్‌ను నియంత్రించాలంటే బౌలర్లు మరింత కష్టపడాల్సిందే.
నిలకడే ఆయుధం
ఇక వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ ఇప్పటిదాకా అందరూ బాగానే ఆడారు. ఓపెనర్లు స్మిత్ (108 పరుగులు), గేల్ (140 పరుగులు) దాదాపు అన్ని మ్యాచ్‌ల్లోనూ మంచి ఆరంభాన్నిచ్చారు. పాక్‌పై ఈ ఇద్దరూ విఫలం కావడం వల్ల మిడిలార్డర్ సత్తా ఏంటో బయటపడింది. సిమ్మన్స్, శామ్యూల్స్, బ్రేవో ముగ్గురూ మంచి టచ్‌లోనే ఉన్నారు. ఇక స్యామీ సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
మరో హిట్టర్ రస్సెల్ అందుబాటులో ఉన్నా ఇప్పటివరకూ అతనికి పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇక బౌలింగ్‌లో పేసర్ సాంటోకీ నిలకడగా రాణిస్తుండటం సానుకూలాంశం. స్పిన్ ద్వయం బద్రీ, నరైన్ ఎలాంటి బ్యాట్స్‌మెన్‌ని అయినా నిలువరిస్తున్నారు. ఇక స్యామీ, బ్రేవో, రస్సెల్‌ల రూపంలో ముగ్గురు ఆల్‌రౌండర్లు ఉన్నారు. అన్ని విభాగాల్లోనూ నిలకడగా రాణిస్తుండటం వెస్టిండీస్‌కు ప్రధాన బలం.
జట్లు (అంచనా)
శ్రీలంక: చండీమల్ (కెప్టెన్), కుషాల్ పెరీరా, దిల్షాన్, జయవర్ధనే, సంగక్కర, మాథ్యూస్, తిసార పెరీరా, సేనానాయకే, హెరాత్, కులశేఖర, మలింగ.
వెస్టిండీస్: స్యామీ (కెప్టెన్), గేల్, స్మిత్, సిమ్మన్స్, శామ్యూల్స్, బ్రేవో, రస్సెల్, రామ్‌దిన్, సాంటోకీ, నరైన్, బద్రీ.
వాతావరణం
వర్షంతో సమస్య లేదు. సాయంత్రం మ్యాచ్ అయినా వేడి ఎక్కువగా ఉంటుంది. మ్యాచ్‌పై వాతావరణం ప్రభావం ఉండకపోవచ్చు.
పిచ్
చాలా స్లోగా ఉంటోంది. స్పిన్నర్లకు పండగే. మంచు ప్రభావం తక్కువ. రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ మరింత స్లోగా మారుతుండటం వల్ల టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది.
కీలక సమరాలు
బద్రీ, నరైన్ x దిల్షాన్, జయవర్ధనే
ఆరంభ ఓవర్లలో బద్రీ, మిడిల్ ఓవర్లలో నరైన్‌ల బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోవడం శ్రీలంకకు కీలకం. బద్రీ, దిల్షాన్‌ని ఆపగలిగితే... మిడిల్ ఓవర్లలో నరైన్‌ను జయవర్ధనే నిలువరించాలి. బద్రీ, నరైన్ కలిపి ఇప్పటికే 16 వికెట్లు తీశారు. ఇద్దరి ఎకానమీ రేట్ 6 లోపే ఉండటం విశేషం.
హెరాత్, సేనానాయకే x గేల్, స్మిత్
వెస్టిండీస్ ఈ టోర్నీలో ఆరంభంలో నిలదొక్కుకుని తర్వాత హిట్టింగ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో సేనానాయకే, హెరాత్ మిడిల్ ఓవర్లలో బ్యాట్స్‌మెన్‌ను నియంత్రించాలి. గేల్ కోసం సేనానాయకేను ఆరంభంలోనే బౌలింగ్‌కు దించినా ఆశ్చర్యం లేదు. హెరాత్ ఒక్క మ్యాచే ఆడినా తనపై లంక భారీ ఆశలు పెట్టుకుంది.
స్యామీ x మలింగ
ఈ మ్యాచ్‌లో మరో ఆసక్తికర సమరం స్యామీ, మలింగల మధ్య జరిగే అవకాశం ఉంది. వికెట్లు ఎన్ని పడ్డాయనే అంశంతో సంబంధం లేకుండా స్యామీ చివరి 4-5 ఓవర్లు క్రీజులో ఉంటున్నాడు. అలాగే లంక చివరి ఓవర్లలో మలింగపై ఆధారపడుతుంది. కాబట్టి ఈ ఇద్దరి మధ్య పోరు ఆసక్తికరం.