
‘దావూద్‌తో సంబంధం ఉంటే క్రికెటర్ అయ్యేవాడిని కాదు’
►కొచ్చి చేరుకున్న శ్రీశాంత్
► ఘన స్వాగతం పలికిన అభిమానులు
కొచ్చి: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీమ్‌తో సంబంధం ఉంటే తాను ఎక్కడో విదేశాల్లో తల దాచుకునేవాడినని స్పాట్ ఫిక్సింగ్ కేసులో నిర్దోషిగా బయటపడిన శ్రీశాంత్ అన్నాడు. శనివారం ఢిల్లీలో కోర్టుకు హాజరైన శ్రీశాంత్... ఆదివారం తన స్వస్థలానికి చేరుకున్నాడు. కొచ్చి విమానాశ్రయంలో ఈ క్రికెటర్‌కు స్నేహితులు, బంధువులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ‘దావూద్‌తో సంబంధం ఉండి ఉంటే నేను ఏ దుబాయ్‌లోనో, మరే ప్రాంతంలోనో ఉండేవాడిని. కనీస పరిచయం ఉన్నా... క్రికెటర్‌గా ఉండకపోయేవాణ్ని. నా కెరీర్ కష్టకాలంలో ఉన్నప్పుడు కేరళ ప్రజలు అండగా నిలిచారు. ఇందుకు చాలా కృతజ్ఞతలు.
నేను సంపాదించిన డబ్బు ఎంతో కష్టపడితేగానీ రాలేదు. అయితే నా వ్యక్తిత్వాన్ని, అంకితభావాన్ని చాలా మంది ప్రశ్నించారు. అన్ని కేసుల నుంచి బయటపడినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని శ్రీశాంత్ వివరించాడు. స్పాట్ ఫిక్సింగ్ కేసుల వల్ల మూసుకుపోయిన తన కెరీర్‌ను తిరిగి పునరుద్ధరించుకుంటానన్నాడు. ఆదివారం కాసేపు నెట్ ప్రాక్టీస్‌లో కూడా పాల్గొన్న ఈ కేరళ స్టార్ తనపై ఉన్న నిషేధాన్ని బీసీసీఐ తొలగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. మరోవైపు శ్రీశాంత్‌పై నిషేధాన్ని ఎత్తివేసే దిశగా చర్యలు చేపట్టాలని కేరళ క్రికెట్ సంఘం (కేసీఏ) ఆదివారం నిర్ణయించింది.