‘సన్’రైజ్ అవుతుందా!
ధనాధన్ క్రికెట్ పండగకు రంగం సిద్ధమైంది. చాంపియన్స్ లీగ్ టి20 టోర్నమెంట్‌లో సత్తా చాటేందుకు భారత్‌తోపాటు న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా దేశవాళీ జట్లు సిద్ధమయ్యాయి. మరో రెండు రోజుల్లో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లతో ఈ టోర్నీకి తెరలేవనుంది. ఐపీఎల్ తర్వాత మరోసారి భారత్ అభిమానులు టి20 క్రికెట్ మజాను రుచి చూడబోతున్నారు.
సాక్షి, హైదరాబాద్: పేరు మారడంతో పాటు అదృష్టం కూడా మారిన హైదరాబాద్ జట్టు ఈ ఏడాది ఐపీఎల్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చింది. సన్‌రైజర్స్‌గా బరిలోకి దిగి టాప్-4 జట్లలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు మరో టి20 టోర్నీ చాంపియన్స్ లీగ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ప్రధాన మ్యాచ్‌లకు అర్హత సాధించేందుకు సన్‌రైజర్స్ క్వాలిఫయింగ్ పోటీలు ఆడాల్సి ఉంది.
మొహాలీలో మంగళవారం జరిగే తొలి మ్యాచ్‌లో కంద్ మారూన్స్‌తో, బుధవారం జరిగే రెండో మ్యాచ్‌లో ఫైసలాబాద్ వోల్వ్స్‌తో రైజర్స్ తలపడుతుంది. రైజర్స్ పాత జట్టు డెక్కన్ చార్జర్స్ 2009లో జరిగిన తొలి చాంపియన్స్ లీగ్‌కు అర్హత సాధించింది. అందులో ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడింది. ఆ తర్వాత మూడు సార్లు చార్జర్స్ క్వాలిఫై కాలేదు.
బౌలింగే బలం...
ఐపీఎల్ తరహాలోనే చాంపియన్స్ లీగ్‌లో కూడా సన్‌రైజర్స్ బౌలింగ్‌నే నమ్ముకుంది. ప్రధానాస్త్రం డేల్ స్టెయిన్ చెలరేగితే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు కష్టాలు తప్పవు. లెగ్‌స్పిన్నర్లు అమిత్ మిశ్రా, కరణ్ శర్మ తమ చక్కటి ప్రదర్శనతో ఐపీఎల్‌లో ఆకట్టుకున్నారు. ఈ ముగ్గురు తమ పూర్తి కోటా బౌలింగ్‌ను పూర్తి చేసే అవకాశం ఉంది.
రెండో పేసర్‌గా ఇషాంత్ శర్మతో పాటు తిసారా పెరీరా, డారెన్ స్యామీ, ఆశిష్ రెడ్డివంటి ఆల్‌రౌండర్లతో టీమ్ సమతూకంగా ఉంది. తన ప్రతిభను ప్రదర్శించేందుకు హైదరాబాద్ యువ ఆటగాడు హనుమ విహారికి ఈ టోర్నీ మరో అవకాశం కల్పిస్తోంది. దూకుడైన ఆటతీరుకు మారుపేరైన ఓపెనర్ శిఖర్ ధావన్‌పై జట్టు బ్యాటింగ్ ఆధారపడి ఉంది. భద్రతలేమి కారణంగా సొంత గడ్డపై క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు ఆడే అవకాశం కోల్పోయిన సన్‌రైజర్స్ దూకుడైన ఆట ప్రదర్శిస్తే సీఎల్‌టి20లో కూడా సత్తా చాటే అవకాశం ఉంది.
ధావన్‌కు నాయకత్వ పగ్గాలు
విధ్వంసకర బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్‌కు మరో ప్రమోషన్ లభించింది. చాంపియన్స్ లీగ్ టి20లో పాల్గొనే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అతడు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రైజర్స్ కెప్టెన్ కుమార సంగక్కర సీఎల్‌టి20లో తన లంక జట్టు కంద్ మారూన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో జట్టు మేనేజ్‌మెంట్ ధావన్‌ను ఎంపిక చేసింది. సంగక్కర స్థానంలో ఐపీఎల్‌లో సగం మ్యాచ్‌లకు కెప్టెన్‌గా పని చేసిన వైట్ కూడా ప్రస్తుతం హైదరాబాద్ టీమ్‌లో ఉన్నాడు.
అయితే అతడిని కాదని ధావన్‌ను ఎంపిక చేయ డం విశేషం. అన్ని ఫార్మాట్‌లలో అద్భుత ఫామ్ తో భారత జట్టులో స్థానం ఖాయం చేసుకున్న శిఖర్, ఐపీఎల్-6లో 10 మ్యాచుల్లో 311 పరుగులు చేసి సన్‌రైజర్స్ టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. జట్టు వివరాలు: శిఖర్ ధావన్ (కెప్టెన్), వైట్, ఆశిష్ రెడ్డి, డుమిని, పార్థివ్ పటేల్ (కీపర్), సమంత్రే, ఇషాంత్, స్టెయిన్, ఆనంద్ రాజన్, అమిత్ మిశ్రా, పెరీరా, స్యామీ, కరణ్, విహారి.