
ఇండోర్: శ్రీలంకతో ఇక్కడ జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ముందుగా ప్రత్యర్థి శ్రీలంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. గత మ్యాచ్‌లో కూడా టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నప్పటికీ అది వర్షార్పణం అయ్యింది. దాంతో ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దయ్యింది. దాంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో బోణీ చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌లో ఆధిక్యంలో నిలుస్తుంది.
దాంతో పాటు ఇది మూడు టీ20ల సిరీస్ కాబట్టి సిరీస్‌ను గెలవాలంటే ప్రతీ మ్యాచ్ టీమిండియాకు ముఖ్యమైనదే. దాంతో ఏమాత్రం పొరపాట్లు చేయకుండా మ్యాచ్‌కు సన్నద్ధమైంది కోహ్లి అండ్ గ్యాంగ్. అదే సమయంలో మలింగా నేతృత్వంలోని లంకేయులు కూడా గెలుపుపై ధీమాగా ఉన్నారు. తమ జట్టులో యువ ఆటగాళ్లతో పాటు సీనియర్లు కూడా ఉండటంతో టీమిండియాను ఓడించడం కష్టమేమీ కాదనే విశ్వాసంతో ఉన్నారు.
రోహిత్ శర్మకు సహచరుడిగా ఇటీవల కేఎల్ రాహుల్ రెండో ఓపెనర్ పాత్రలో అద్భుతంగా ఆడుతున్నాడు. దాంతో సీనియర్ శిఖర్ ధావన్ కెరీర్‌కు సంకటం ఎదురైంది. రోహిత్ విశ్రాంతితో ఈ సిరీస్‌లో ధావన్ అవకాశం దక్కించుకున్నాడు. తనలో ఇంకా టి20 సత్తా ఉందని అతను నిరూపించుకోవాల్సిన పరిస్థితిలో నిలిచాడు. ధావన్ ఇక ఈ ఫార్మాట్‌కు పనికి రాడంటూ మాజీ ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్ సహా పలువురి నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో... ధావన్ తన పూర్తి సత్తాను ప్రదర్శించాల్సిందే. కోహ్లి, అయ్యర్, పంత్, దూబేలతో దుర్బేధ్యంగా కనిపిస్తున్న భారత బ్యాటింగ్ గురించి ఏ రకమైన ఆందోళన అవసరం లేదు. భారత జట్టు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. గత మ్యాచ్‌కు ప్రకటించిన జట్టుతోనే రెండో టీ20కి కూడా సిద్ధమైంది.
ఇక 12 ఏళ్ల కిత్రం విరాట్ కోహ్లి అరంగేట్రం చేసినప్పటి నుంచీ భారత్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్ (మూడు ఫార్మాట్లలోనూ)లన్నింటిలోనూ శ్రీలంక ఓడింది. అప్పటి నుంచి వరుసగా 16 మ్యాచ్‌లలో ఆ జట్టు పరాజయం పాలైంది. ఒక్క 2014 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో మాత్రం గెలిచింది. ఈ నేపథ్యంలో పటిష్టమైన భారత్‌ను ఓడించడం అంత సులువు కాదు. జట్టులో సీనియర్లతో పాటు యువ ఆటగాళ్లు కూడా ఎక్కువే ఉన్నప్పటికీ భారత్‌ను స్వదేశంలో ఓడించడం లంకకు కాస్త కష్టమే. లంక సైతం గత మ్యాచ్‌కు ప్రకటించిన తుది జట్టుతోనే బరిలోకి దిగుతోంది.
భారత జట్టు
విరాట్ కోహ్లి(కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, శివం దూబే, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, నవదీప్ సైనీ, బుమ్రా
శ్రీలంక జట్టు
లసిత్ మలింగా(కెప్టెన్), దినుష్కా గుణతిలకా, అవిష్కా ఫెర్నాండో, కుశాల్ పెరీరా, ఒషాడో ఫెర్నాండో, భానుక రాజపక్సే, ధనంజయ డిసిల్వా, షనకా, ఇసురు ఉదాన, వానిందు హసరంగా, లహిరు కుమార