ముంబై టెస్టులో రెండో రోజు ఆటలో ఆధిక్యం భారత్, ఇంగ్లండ్ మధ్య దోబూచులాడింది. ముందుగా చేతిలో ఉన్న ఐదు వికెట్లతో ఇంగ్లండ్ తాము ఆశించిన రీతిలో 400 పరుగుల మార్క్‌ను చేరుకోగా... ఆ తర్వాత భారత బ్యాట్స్‌మెన్ కూడా గట్టిగా నిలబడి జట్టుకు శుభారంభం అందించారు. తొలి సెషన్‌ను ఇంగ్లండ్, చివరి సెషన్‌ను భారత్ సొంతం చేసుకోగా, రెండో సెషన్‌ను ఇరు జట్లూ పంచుకున్నారుు. అటు బట్లర్, ఇటు విజయ్ బ్యాటింగ్ ఆటలో హైలైట్‌గా నిలవగా, ఎప్పటిలాగే తనకు అలవాటైన రీతిలో మరోసారి ‘ఇన్నింగ్‌సలో ఐదు వికెట్ల ఘనత’ను అశ్విన్ తన జేబులో వేసుకున్నాడు.
తమ బ్యాటింగ్ బలగం స్థాయికి తగినట్లుగా భారత్ మూడో రోజు కూడా సత్తా చాటితే ఆట ముగిసే సరికి ఆధిక్యం మన సొంతం కావచ్చు. అప్పుడు తర్వాతి రెండు రోజుల ఆట ఆసక్తికరంగా మారిపోతుంది. ఒకవేళ మ్యాచ్ ఆరంభానికి ముందు అంచనా వేసినట్లుగా మూడో రోజు నుంచే బంతి అనూహ్యంగా తిరిగినా... ప్రత్యర్థి జట్టులో దానిని సమర్థంగా ఉపయోగించుకునే స్థాయి నాణ్యమైన స్పిన్నర్ లేకపోవడం మన జట్టుకు అనుకూలాంశం. మొత్తంగా శనివారం జరగబోయే ఆట నాలుగో టెస్టు, సిరీస్ ఫలితాన్ని తేల్చే అవకాశం ఉంది.
భారత్ 146/1
రాణించిన మురళీ విజయ్
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్‌సలో 400 ఆలౌట్
6 వికెట్లు తీసిన అశ్విన్
ముంబై: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ తమ తొలి ఇన్నింగ్‌సను మెరుగైన రీతిలో ఆరంభించింది. శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 52 ఓవర్లలో వికెట్ నష్టానికి 146 పరుగులు చేసింది. అర్ధ సెంచరీ సాధించిన మురళీ విజయ్ (169 బంతుల్లో 70 బ్యాటింగ్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), చతేశ్వర్ పుజారా (102 బంతుల్లో 47 బ్యాటింగ్; 6 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. వీరిద్దరు రెండో వికెట్‌కు ఇప్పటికే అభేద్యంగా 107 పరుగులు జోడించారు. రాహుల్ (24) తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఇంగ్లండ్ స్కోరుకు భారత్ మరో 254 పరుగులు వెనుకబడి ఉంది.
అంతకుముందు 288/5 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్‌సలో 400 పరుగులకు ఆలౌటైంది. జాస్ బట్లర్ (137 బంతుల్లో 76; 6 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్‌స ఆడాడు. రవిచంద్రన్ అశ్విన్ (6/112) చెలరేగగా, రవీంద్ర జడేజాకు మిగిలిన 4 వికెట్లు దక్కాయి.
అశ్విన్ మాయ...
అశ్విన్ ఇన్నింగ్‌సలో 5 వికెట్లు పడగొట్టడం ఇది 23వ సారి. దీంతో అతను కపిల్ దేవ్ (23) రికార్డును సమం చేశాడు. కేవలం 43 టెస్టుల్లోనే అశ్విన్ ఈ ఘనత సాధించడం విశేషం. ఎక్కువ సార్లు ఇన్నింగ్‌సలో ఐదు వికెట్లు తీసిన భారత బౌలర్లలో కుంబ్లే (35), హర్భజన్ సింగ్ (25) మాత్రమే అశ్విన్‌కంటే ముందు ఉన్నారు. ఓవరాల్‌గా సిడ్నీ బార్‌న్‌స మాత్రమే అశ్విన్ కంటే వేగంగా 27 టెస్టుల్లో రికార్డును నమోదు చేశాడు. ఈ ఒక్క ఏడాదే అశ్విన్ 7 సార్లు ఇన్నింగ్‌సలో ఐదు వికెట్లు పడగొట్టాడు. భారత్‌లో ఆడిన 26 టెస్టుల్లోనే అశ్విన్ 18 సార్లు ఇన్నింగ్‌సలో ఐదు వికెట్లు తీయడం మరో విశేషం. 2016లో ఇప్పటికే 48 వికెట్లు తీసిన అశ్విన్, భారత గడ్డపై ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఎక్కువ వికెట్లు పడగొట్టిన భారత స్పిన్నర్‌గా ఎరాపల్లి ప్రసన్న (46) పేరిట 1969 నుంచి ఉన్న రికార్డును
తిరగరాశాడు.
చరిత్ర ఏం చెబుతోంది?
ఈ సిరీస్‌లోని గత రెండు టెస్టుల్లో ఇరు జట్ల ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోకుండా చూస్తే ముంబైలో టెస్టు రికార్డు ఆసక్తికరంగా కనిపిస్తుంది. ఇంగ్లండ్‌కు ఈ మైదానం బాగా కలిసొచ్చింది. ఆ జట్టు వాంఖెడే స్టేడియంలో ఆడిన గత రెండు టెస్టులలోనూ గెలిచింది. వాటిలో రెండు సార్లు తొలి ఇన్నింగ్‌సలో 400 స్కోరు చేసింది. 2006లోనైతే సరిగ్గా 400 పరుగులే చేసింది. పోలిక న్యాయం కాదు గానీ నాడు కూడా ఆశ్చర్యకరంగా దక్షిణాఫ్రికాలో పుట్టి ఇంగ్లండ్‌కు ఆడిన ఓపెనర్ స్ట్రాస్ సెంచరీ చేశాడు! ఈ మైదానంలో 400 పరుగులు చేసిన తర్వాత నిశ్చింతగా ఉండవచ్చని గణాంకాలు చెబుతున్నారుు. ఈ మ్యాచ్‌కు ముందు 1975 నుంచి ఇక్కడ మొత్తం 14 టెస్టులు జరిగారుు. వీటిలో ఒక్కసారి మాత్రమే 400 పరుగులు చేసి కూడా భారత్, వెస్టిండీస్ చేతిలో ఓడింది. అది మినహా మిగిలిన 13 టెస్టులలో తొలి ఇన్నింగ్‌సలో 400 పరుగులు చేసిన జట్లు 6 సార్లు గెలవగా, మరో 7 మ్యాచ్‌లు డ్రాగా ముగిశారుు. ఉపఖండంలో ఆడిన మ్యాచ్‌లలో తొలి ఇన్నింగ్‌సలో 400 పరుగులు చేసిన తర్వాత ఇంగ్లండ్ ఒక్కసారి కూడా టెస్టు ఓడిపోలేదు. అరుుతే 2000 నుంచి చూస్తే ప్రత్యర్థి 400కు పైగా చేసినా... ఇతర జట్లకంటే ఎక్కువ సార్లు (8) మ్యాచ్‌లు గెలవగలిగిన రికార్డు మాత్రం భారత్‌దే. మరి ఈ సారి ఫలితం ఎలా ఉండబోతోందో.
సెషన్-1: బట్లర్ జోరు
రెండో రోజు ఆరంభంలోనే ఇంగ్లండ్ వికెట్ కోల్పోయింది. అశ్విన్ వేసిన మూడో ఓవర్లో స్టోక్స్ (92 బంతుల్లో 31; 3 ఫోర్లు) వివాదాస్పద రీతిలో అవుటయ్యాడు. స్టోక్స్ డిఫెన్‌స ఆడబోగా, బంతి కీపర్‌కు తగులుతూ వెళ్లి స్లిప్‌లో కోహ్లి చేతిలో పడింది. భారత్ అప్పీల్‌ను అంపైర్ ఆక్సెన్‌ఫోర్డ్ తిరస్కరించడంతో కోహ్లి రివ్యూ కోరాడు. టీవీ రీప్లేలు చూసిన అనంతరం బంతి బ్యాట్‌ను దాటే సమయంలో దిశ మళ్లిందని నిర్ధారించిన మూడో అంపైర్ అవుట్‌గా ప్రకటించారు. అయితే హాక్ ఐ లో ‘అల్ట్రా ఎడ్‌జ’ గుర్తించిన శబ్దాన్ని బట్టి అంపైర్ శంషుద్దీన్ నిర్ణయం తీసుకోవడం వివాదానికి కారణమైంది. అదే సమయంలో బ్యాట్ కూడా నేలకు తగలడం వల్లే శబ్దం వచ్చిందని భావించిన స్టోక్స్, నిరాశగా వెనుదిరిగాడు. మరోవైపు బట్లర్ మాత్రం వేగంగా ఆడి చకచకా పరుగులు రాబట్టాడు. అయితే తక్కువ వ్యవధిలో వోక్స్ (11), రషీద్ (4)లను అవుట్ చేసి జడేజా, భారత్‌కు మరో రెండు వికెట్లు అందించాడు. అనంతరం 106 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న బట్లర్‌కు జేక్ బాల్ (60 బంతుల్లో 31; 4 ఫోర్లు) చక్కటి సహకారం అందించాడు. ఎట్టకేలకు 121 ఓవర్ల తర్వాత భారత్ కొత్త బంతిని తీసుకుంది.
ఓవర్లు: 31, పరుగులు: 97, వికెట్లు: 3 (ఇంగ్లండ్)
సెషన్-2: రాహుల్ విఫలం
లంచ్ తర్వాత కొద్దిసేపటికే ఇంగ్లండ్ ఇన్నింగ్‌స ముగిసింది. తొమ్మిదో వికెట్‌కు బట్లర్‌తో కలిసి 54 పరుగులు జోడించిన బాల్‌ను అశ్విన్ అవుట్ చేసి ఈ జోడీని విడదీశాడు. అశ్విన్ ఓవర్లో భారీ సిక్సర్ కొట్టిన అనంతరం బట్లర్... జడేజా వేసిన తర్వాతి ఓవర్ తొలి బంతికే మరో భారీ షాట్ ఆడబోరుు వెనుదిరిగాడు. భారత ఓపెనర్లు విజయ్, రాహుల్ (41 బంతుల్లో 24; 4 ఫోర్లు) జాగ్రత్తగా ఇన్నింగ్‌స మొదలు పెట్టారు. రాహుల్ కొన్ని చక్కటి షాట్లు ఆడగా, ఫామ్‌లో వచ్చేందుకు ప్రయత్నించిన విజయ్, ఓపిగ్గా బంతులను ఎదుర్కొన్నాడు. అరుుతే మెరుగైన ఆరంభాన్ని మళ్లీ వృథా చేస్తూ రాహుల్ వికెట్ చేజార్చుకున్నాడు. అలీ బంతిని డ్రైవ్ చేయడంలో విఫలమై రాహుల్ బౌల్డయ్యాడు. రషీద్ ఓవర్లో ఫోర్, సిక్స్‌తో విజయ్ వేగం పెంచాడు.
ఓవర్లు: 5.1, పరుగులు: 15, వికెట్లు: 2 (ఇంగ్లండ్)
ఓవర్లు: 22, పరుగులు: 62, వికెట్లు: 1 (భారత్)
సెషన్-3: భారత్‌దే పైచేయి
విరామం తర్వాత విజయ్, పుజారా ప్రత్యర్థి బౌలర్లకు ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు. క్రీజ్‌లోకి పాతుకుపోయిన వీరిద్దరు చక్కటి సమన్వయంతో ఆడారు. 45 పరుగుల వద్ద విజయ్‌ను స్టంప్ చేసేందుకు వచ్చిన అవకాశాన్ని బెయిర్‌స్టో వృథా చేశాడు. అండర్సన్ ఓవర్లో పుజారా వరుసగా రెండు బౌండరీలు బాదగా... అలీ బౌలింగ్‌లో థర్డ్‌మ్యాన్ దిశగా ఫోర్ కొట్టి 126 బంతుల్లో విజయ్ హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. ఈ భాగస్వామ్యాన్ని విడదీసేందుకు కుక్ ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. రాహుల్ అవుటైన తర్వాత విజయ్, పుజారా 38 ఓవర్లు మెరుగైన బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చడంతో రెండో రోజును కోహ్లి సేన సంతృప్తికరంగా ముగించగలిగింది. రెండో రోజు బంతి చెప్పుకోదగ్గ రీతిలో స్పిన్, బౌన్‌స అయినా... ఇంగ్లండ్ ప్రధాన స్పిన్నర్లు అలీ, రషీద్ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.
ఓవర్లు: 30, పరుగులు: 84, వికెట్లు: 0 (భారత్)
స్కోరు వివరాలు
ఇంగ్లండ్ తొలి ఇఇన్నింగ్స్: కుక్ (స్టంప్డ్) పార్థివ్ (బి) జడేజా 46; జెన్నింగ్‌స (సి) పుజారా (బి) అశ్విన్ 112; రూట్ (సి) కోహ్లి (బి) అశ్విన్ 21; అలీ (సి) నాయర్ (బి) అశ్విన్ 50; బెరుుర్‌స్టో (సి) ఉమేశ్ (బి) అశ్విన్ 14; స్టోక్స్ (సి) కోహ్లి (బి) అశ్విన్ 31; బట్లర్ (బి) జడేజా 76; వోక్స్ (సి) పార్థివ్ (బి) జడేజా 11; రషీద్ (బి) జడేజా 4; బాల్ (సి) పార్థివ్ (బి) అశ్విన్ 31; అండర్సన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (130.1 ఓవర్లలో ఆలౌట్) 400.
వికెట్ల పతనం: 1-99; 2-136; 3-230; 4-230; 5-249; 6-297; 7-320; 8-334; 9-388; 10-400.
బౌలింగ్: భువనేశ్వర్ 13-0-49-0; ఉమేశ్ 11-2-38-0; అశ్విన్ 44-4-112-6; జయంత్ 25-3-89-0; జడేజా 37.1-5-109-4.
భారత్ తొలి ఇన్నింగ్స్: రాహుల్ (బి) అలీ 24; విజయ్ (బ్యాటింగ్) 70; పుజారా (బ్యాటింగ్) 47; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (52 ఓవర్లలో వికెట్ నష్టానికి) 146.
వికెట్ల పతనం: 1-39.
బౌలింగ్: అండర్సన్ 8-4-22-0; వోక్స్ 5-2-15-0; అలీ 15-2-44-1; రషీద్ 13-1-49-0; బాల్ 4-2-4-0; స్టోక్స్ 4-2-4-0; రూట్ 3-1-3-0.