
భారత్ ‘ఎ’ ఓటమి
- ఖవాజ, బర్న్స్ సెంచరీలు
- ముక్కోణపు సిరీస్‌లో ఆసీస్ ‘ఎ’కు రెండో విజయం
చెన్నై: భారీ లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడిన భారత్ ‘ఎ’ జట్టు... ముక్కోణపు సిరీస్‌లో పరాజయం పాలైంది. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ విఫలంకావడంతో శుక్రవారం ఆస్ట్రేలియా ‘ఎ’తో జరిగిన మ్యాచ్‌లో 119 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఎం.ఎ.చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 50 ఓవర్లలో 4 వికెట్లకు 334 పరుగులు చేసింది. జోయ్ బర్న్స్ (131 బంతుల్లో 154; 5 ఫోర్లు, 14 సిక్సర్లు), కెప్టెన్ ఉస్మాన్ ఖవాజ (104 బంతుల్లో 100; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీలతో దుమ్మురేపారు.
ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 33.5 ఓవర్లలో 239 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. వేడ్ (34 నాటౌట్) మోస్తరుగా ఆడాడు. పసలేని భారత బౌలింగ్‌ను బర్న్స్ సిక్సర్లతో ఉతికిపారేశాడు. తర్వాత భారత్ 42.3 ఓవర్లలో 215 పరుగులకే ఆలౌటయింది. ఉన్ముక్త్ చంద్ (47 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. కేదార్ జాదవ్ (56 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. సంధూ, జంపా చెరో 4 వికెట్లు తీశారు. ఆసీస్ ‘ఎ’కు ఇది వరుసగా రెండో విజయం. బర్న్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభిం చింది. ఆదివారం జరిగే మ్యాచ్‌లో భారత్.. దక్షిణాఫ్రికాతో తలపడుతుంది.