‘శత’క్కొట్టారు
దక్షిణాఫ్రికా పర్యటనలో భారత కుర్రాళ్లు దుమ్మురేపే ఆటతీరుతో అదరగొడుతున్నారు. ముక్కోణపు వన్డే టోర్నీలో చూపిన ప్రదర్శననే దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టుతో జరుగుతున్న నాలుగు రోజుల అనధికార టెస్టులోనూ కనబరుస్తున్నారు.
రుస్తెన్‌బర్గ్: దక్షిణాఫ్రికా పర్యటనలో భారత కుర్రాళ్లు దుమ్మురేపే ఆటతీరుతో అదరగొడుతున్నారు. ముక్కోణపు వన్డే టోర్నీలో చూపిన ప్రదర్శననే దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టుతో జరుగుతున్న నాలుగు రోజుల అనధికార టెస్టులోనూ కనబరుస్తున్నారు. తొలి రోజు కెప్టెన్ చతేశ్వర్ పుజారా సెంచరీతో భారీ స్కోరుకు పునాది వేయగా... రెండో రోజు ఆటలో రోహిత్ శర్మ (257 బంతుల్లో 119; 14 ఫోర్లు; 2 సిక్స్), సురేశ్ రైనా (177 బంతుల్లో 135; 14 ఫోర్లు; 3 సిక్స్) అద్భుత శతకాలతో చెలరేగి జట్టును పటిష్టస్థితిలో నిలిపారు. వీరి ఆటతీరుతో ఆదివారం తమ తొలి ఇన్నింగ్స్‌ను భారత్ ‘ఎ’ జట్టు తొమ్మిది వికెట్లకు 582 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. చివర్లో ఉనాద్కట్ (37 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు), నదీమ్ (50 బంతుల్లో 46 నాటౌట్; 3 ఫోర్లు) వేగంగా ఆడి తమ వంతు సహకారం అందించారు.
పార్నెల్, డుమినిలకు మూడేసి వికెట్లు దక్కాయి. దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టు ఆట ముగిసే సమయానికి తమ తొలి ఇన్నింగ్స్‌లో తొమ్మిది ఓవర్లలో వికెట్ నష్టానికి 20 పరుగులు చేసింది. క్రీజులో ఎల్గర్ (9), హార్మర్ (1) ఉన్నారు. అంతకుముందు 281/3 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ వరుసగా ఆరు ఓవర్ల దాకా పరుగుల ఖాతా తెరువలేదు. తొమ్మిదో ఓవర్‌లో రోహిత్ ఓ సిక్స్, రైనా వరుసగా రెండు ఫోర్లు బాదడంతో 17 పరుగులు వచ్చాయి. అక్కడి నుంచి ఈ జోడి తమ దూకుడును తగ్గించలేదు. 231 బంతుల్లో రోహిత్ సెంచరీ చేయగా లంచ్ అనంతరం తొలి ఓవర్‌లోనే డుమినికి దొరికిపోయాడు. దీంతో నాలుగో వికెట్‌కు 106 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.
మరి కొద్ది సేపట్లోనే రహానే (10), సాహా (1) అవుటైనా రైనా తన జోరు తగ్గించలేదు. 157 బంతుల్లో సెంచరీ చేశాడు. ఆ తర్వాత డుమిని బౌలింగ్‌లో 6,4,6తో బ్యాట్ ఝుళిపించాడు. టీ బ్రేక్ అనంతరం రైనా దూకుడును పార్నెల్ అడ్డుకున్నాడు. ఆ తర్వాత మూడు ఓవర్లలో మూడు వికెట్లు పడడంతో భారత్ ఆలౌట్ ఖాయమనుకున్నా చివరి వికెట్‌కు నదీమ్, ఉనాద్కట్ వీరోచిత ఆటతీరుతో ఏకంగా 82 పరుగులు జత చేరాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ‘ఎ’ 18 పరుగులకే తొలి వికెట్‌ను కోల్పోయినా మరో వికెట్ కోల్పోకుండా రోజును ముగించింది.
సంక్షిప్త స్కోర్లు
భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 582/9 డిక్లేర్డ్ (163 ఓవర్లలో) (పుజారా 137, రోహిత్ శర్మ 119, సురేశ్ రైనా 135, పార్నెల్ 3/89, డుమిని 3/80) దక్షిణాఫ్రికా ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 20/1 (9 ఓవర్లలో).