
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన మూడో టెస్ట్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. స్పిన్నర్ లేకుండా టీమిండియా బరిలోకి దిగుతోంది. జట్టు కూర్పులో రెండు మార్పులు జరిగాయి. రోహిత్ శర్మ స్థానంలో అజింక్య రహానే, అశ్విన్ ప్లేస్‌లో భువనేశ్వర్ కుమార్‌కు చోటు కల్పించారు. మొదటి రెండు మ్యాచ్‌ల్లో చాలా తప్పులు చేశామని, వీటిని సరిదిద్దుకుంటామని కెప్టెన్ విరాట్ కోహ్లి అన్నాడు.
దక్షిణాఫ్రికా జట్టు కూడా స్పినర్ లేకుండానే బరిలోకి దిగుతోంది. స్పిన్నర్ కేశవ్ మహరాజ్ స్థానంలో ఆల్‌రౌండర్ ఆండిలె ఫెహ్లుక్వాయోను తీసుకున్నట్టు కెప్టెన్ డుప్లెసిస్ వెల్లడించాడు. మొదటి రెండు టెస్టుల్లోనూ సఫారీ టీమ్ గెలిచిన సంగతి తెలిసింది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్వీన్‌స్వీప్ చేయాలని ఆతిథ్య జట్టు ఉవ్విళ్లూరుతోంది. చివరి మ్యాచ్‌లోనైనా పరువు నిలుపుకోవాలని టీమిండియా భావిస్తోంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. 7 పరుగుల వద్ద ఓపెనర్ కేఎల్ రాహుల్ డకౌటయ్యాడు. ఫిలాండర్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.