
ధోని సేన 'ఆరంభం' అదుర్స్
మిర్పూర్:ఆసియాకప్లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి ట్వంటీ 20 మ్యాచ్ లో టీమిండియా శుభారంభం చేసింది. తొలుత బ్యాటింగ్లో ఆకట్టుకున్న టీమిండియా.. ఆపై బౌలింగ్, ఫీల్డింగ్లో ఆకట్టుకుని 45 పరుగుల విజయాన్ని అందుకుంది.టీమిండియా నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ 20. 0 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 121 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది.బంగ్లా ఆటగాళ్లలో షబ్బీర్ రెహ్మాన్(44) మినహా ఎవరూ రాణించలేదు. భారత బౌలర్లలో ఆశిష్ నెహ్రాకు మూడు వికెట్లు లభించగా, బూమ్రా, హార్దిక్ పాండ్యా, అశ్విన్లకు తలో వికెట్ దక్కింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 166 పరుగులు నమోదు చేసింది. 42 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును రోహిత్ శర్మ ఆదుకున్నాడు. వికెట్లు పడుతున్నా తనదైన శైలికి ఏమాత్రం తగ్గని రోహిత్ (83; 55 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అదరగొట్టాడు. తన వ్యక్తిగత స్కోరు 21 పరుగుల వద్ద షకిబ్ క్యాచ్ ను వదిలివేయడంతో దాన్ని రోహిత్ సద్వినియోగం చేసుకుని బంగ్లాకు చుక్కులు చూపించాడు. రోహిత్ చివరి 62 పరుగులను సాధించే క్రమంలో 27 బంతులనే మాత్రమే ఎదుర్కొన్నాడు. ఈ మ్యాచ్ లో రోహిత్ రెండొందలకు పైగా స్టైక్ రేట్ ను సాధించడం విశేషం.
అతనికి జతగా హార్దిక్ పాండ్యా(31;16 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) నిలకడను ప్రదర్శించాడు. ఈ జోడి 61 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ధోని అండ్ గ్యాంగ్ తేరుకుంది. కాగా, స్కోరును పెంచే క్రమంలో వీరిద్దరూ చివరి ఓవర్ లో అవుట్ అయ్యారు. ఆ తరువాత కేవలం రెండు బంతులను మాత్రమే ఎదుర్కొన్న కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఒక సిక్స్ సాయంతో ఎనిమిది పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. విజయంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. టీమిండియా తన తదుపరి మ్యాచ్ ను శనివారం పాకిస్తాన్ తో ఆడనుంది.