
వాయనాడ్: ఇంగ్లండ్ లయన్స్‌తో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’ భారీస్కోరు చేసింది. ఓపెనర్ ప్రియాంక్ పాంచల్ (313 బంతుల్లో 206; 26 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్ సెంచరీతో, ఆంధ్ర రంజీ క్రికెటర్ కోన శ్రీకర్ భరత్ (139 బంతుల్లో 142; 11 ఫోర్లు) సెంచరీతో కదంతొక్కారు. దీంతో భారత్ ‘ఎ’ 134.5 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 540 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 219/1తో ఆటకొనసాగించిన భారత్ ఆదిలోనే ఓపెనర్ లోకేశ్ రాహుల్ (89; 11 ఫోర్లు) వికెట్‌ను కోల్పోయింది. క్రితం రోజు స్కోరుకు కేవలం పరుగు మాత్రమే జతచేసిన రాహుల్ రెండో వికెట్‌గా నిష్క్రమించాడు. తర్వాత వచ్చిన వారిలో కెప్టెన్ అంకిత్ బావ్నే (0) డకౌట్ కాగా, ఆంధ్ర బ్యాట్స్‌మన్ రికీ భుయ్ (16) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు.
దీంతో 262 పరుగుల వద్ద నాలుగు వికెట్లు కోల్పోయిన భారత్ ‘ఎ’ను పాంచల్, శ్రీకర్ భరత్ నిలబెట్టారు. ముందుగా కుదురుకునేందుకు ప్రాధాన్యమిచ్చినా... తర్వాత భరత్ వన్డేను తలపించే ఇన్నింగ్స్ ఆడాడు. ఇద్దరు కలిసి ఐదో వికెట్‌కు 196 పరుగులు జోడించారు. ద్విశతకం పూర్తయ్యాక జట్టు స్కోరు 458 పరుగుల వద్ద పాంచల్ నిష్క్రమించాడు. జలజ్ సక్సేనా (28)తో కలిసి జట్టు స్కోరును 500 పరుగులు దాటించాక శ్రీకర్ భరత్ ఔటయ్యాడు. కాసేపటికే కెప్టెన్ బావ్నే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. దీంతో భారత్ ‘ఎ’కు 200 పరుగుల ఆధిక్యం లభించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఇంగ్లండ్ లయన్స్ ఆట నిలిచే సమయానికి 5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 20 పరుగులు చేసింది. ఓపెనర్లు హోల్డన్ (9 బ్యాటింగ్), డకెట్ (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.