దిగ్గజాల నుంచి గద అందుకుంటున్న కోహ్లి
కేప్‌టౌన్ : మూడో టీ20 విజయంతో దక్షిణాఫ్రికా పర్యటనను విజయవంతంగా ముగించిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ఐసీసీ ప్రతిష్టాత్మ టెస్ట్ చాంపియన్‌షిప్ గదను అందుకున్నాడు. మ్యాచ్ అనంతరం దిగ్గజ ఆటగాళ్లు సునీల్ గావస్కర్, గ్రేమ్ పొలాక్ చేతుల మీదుగా కోహ్లి గదను అందుకున్నాడు.
గత నెలలో జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన చివరి టెస్ట్‌లో భారత విజయం సాధించి ఐసీసీ ర్యాకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కాపాడుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కటాఫ్ తేదీ అయిన ఏప్రిల్ 3 వరకు మరే జట్టు భారత్‌ను ర్యాంకింగ్స్‌లో వెనక్కి నెట్టే అవకాశం లేకపోవడంతో ప్రతిష్టాత్మక గదతో పాటు 10 లక్షల డాలర్ల ప్రైజ్ మనీ వరించింది.
124 పాయింట్లతో దక్షిణాఫ్రికా గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా రెండు టెస్టుల్లో ఓడి 121 పాయింట్లకు చేరినా ర్యాంకింగ్‌లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. 111 పాయింట్లతో ఉన్న దక్షిణాఫ్రికా 115 పాయింట్ల చేరి రెండో ర్యాంకులోనే ఉండటంతో ఐసీసీ టెస్ట్ చాంపియన్ షిప్ గదను టీమిండియా అందుకోవడానికి ఉపకరించింది.
2002 తర్వాత ఐసీసీ టెస్ట్ చాంపియన్ షిప్ గద అందుకున్న పదో కెప్టెన్‌గా కోహ్లీ నిలిచాడు. 2016లో కోహ్లి తొలి సారి ఐసీసీ గదను అందుకున్నాడు. ఇక ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో దక్షిణాఫ్రికా కనీసం ఒక మ్యాచ్‌లోనైనా గెలిస్తేనే రెండో స్థానంలో కొనసాగుతోంది. దీంతో 5 లక్షల డాలర్ల ప్రైజ్ మనీ అందుకునే అవకాశం దక్కుతుంది. మూడో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా చేతిలో ఇప్పటికే 2 లక్షల డాలర్లు ఉన్నాయి. ఒకవేళ ఆస్ట్రేలియా కనుక దక్షిణాఫ్రికాపై 3-0, లేదంటే 4-0తో విజయం సాధిస్తే వీరి ర్యాంకులు తారుమారై ఆసీస్ రెండో స్థానానికి చేరుకుంటుంది. ఇక మార్చిలో ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ గెలిచిన వారికి లక్ష డాలర్ల ప్రైజ్ మనీ లభిస్తుంది. ఒకవేళ సిరీస్ డ్రా అయితే నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌కే ఆ ప్రైజ్ మనీ లభిస్తుంది.
మూడో టీ20లో ఆతిథ్య జట్టుపై భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి టీ20 సిరీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. రైనా, భువీల అద్భుత ప్రదర్శనతో భారత్‌కు విజయం వరించింది. 2-1తో టెస్ట్ సిరీస్ ఓడినా.. కోహ్లి సేన 5-1తో వన్డే, 2-1తో టీ20 సిరీస్‌లను కైవసం చేసుకుని పర్యటనను సగర్వంగా ముగించింది.
Comments
Please login to add a commentAdd a comment