భారత మహిళా అథ్లెట్ కు కాంస్యం
కజన్: భారత అథ్లెట్ ప్రియేశా దేశ్ముఖ్ చరిత్ర సృష్టించింది. రష్యాలోని కజన్ లో జరుగుతన్న వరల్డ్ డెఫ్ షూటింగ్ చాంపియన్ షిప్ లో భారత షూటర్ ప్రియేశా కాంస్యం సాధించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ విభాగంలో పాల్గొన్న ప్రియేశా 180.4 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఉక్రెయిన్ షూటర్ స్విత్లానా యట్సెన్కో 201.6 పాయింట్లు, సెర్బియాకు చెందిన గోర్డానా మికోవిక్ ముసిబాబిక్ 200.3 పాయింట్లు సాధించి వరుసగా స్వర్ణ, రజత పతకాలు కైవసం చేసుకున్నారు. ఫైనల్ రౌండ్ కు ముందు నిర్వహించిన క్వాలిఫైయింగ్ రౌండ్ లో 404.9 పాయింట్లు స్కోర్ చేసింది.
బదిర(చెవిటి) విభాగంలో జాతీయస్థాయిలో గత మూడేళ్లుగా ప్రియేశా బంగారు పతకాలను కొల్లగొడుతున్న విషయం తెలిసిందే. అయితే తొలిసారి అంతర్జాతీ స్థాయి ఈవెంట్లో పాల్గొని పతకం సాధించడంపై ఆమె తండ్రి శరద్ రావ్ హర్షం వ్యక్తంచేశారు. తన కూతురు ఎంతో కష్టపడిందని, అందుకు ప్రతిఫలం దక్కిందన్నారు. అయితే వీరికంటూ జాతీయస్థాయిలో ఎలాంటి పోటీలు నిర్వహించడం లేదని, ప్రత్యేక బోర్డు కూడా లేదని ఆయన తెలిపారు. పారా అథ్లెట్ల నిర్వహణ జాతీయ రైఫిల్స్ అసోసియేషన్ వారు చూస్తున్నారని ప్రియేశా తండ్రి వివరించారు.