క్లీన్స్వీప్పై టీమిండియా గురి | India eye series sweep to cap off tour | Sakshi
Sakshi News home page

క్లీన్స్వీప్పై టీమిండియా గురి

Published Sat, Jan 30 2016 3:19 PM | Last Updated on Sun, Sep 3 2017 4:38 PM

క్లీన్స్వీప్పై టీమిండియా గురి

క్లీన్స్వీప్పై టీమిండియా గురి

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుతో వన్డేల్లో ఎదురైన పరాభావానికి ట్వంటీ20ల్లో ఘన విజయంతో సమాధానం చెప్పింది టీమిండియా.

సిడ్నీ:ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుతో వన్డేల్లో ఎదురైన పరాభావానికి ట్వంటీ20ల్లో ఘన విజయంతో సమాధానం చెప్పింది టీమిండియా. మూడు మ్యాచ్ ల ట్వంటీ 20 సిరీస్లొ వరుస రెండు ట్వంటీ 20 లను గెలిచి  ఆసీస్కు షాకిచ్చింది. ఇంకా చివరి మ్యాచ్ మిగిలి ఉండటంతో అందులో కూడా విజయం సాధించి టోర్నీకి ఘనమైన ముగింపు ఇవ్వాలని ధోని సేన కసరత్తులు చేస్తోంది.  ఆదివారం ఇరు జట్ల మధ్య సిడ్నీ వేదికగా ఆఖరి ట్వంటీ 20 జరుగనుంది. రేపు మధ్యాహ్నం గం.2.08 ని.లకు(భారత కాలమాన ప్రకారం) మ్యాచ్ ఆరంభం కానుంది. వన్డేల్లో తనదైన ముద్రతో రెచ్చిపోయిన ఆసీస్..  ట్వంటీ 20లకు వచ్చేసరికి బోర్లా పడింది. ఇప్పటివరకూ జరిగిన రెండు మ్యాచ్ల్లోనూ ఘోరంగా వైఫల్యం చెంది సిరీస్ ను చేజార్చుకుంది.   లక్ష్య ఛేదనలో భాగంగా భారత బౌలర్లను ఆదిలో ప్రతిఘటించిన ఆసీస్.. ఆ తరువాత ఒత్తిడికి లోనై ఓటమి చెందింది. ఆ రెండు మ్యాచ్ల్లోనూ టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి 180కు పైగా స్కోర్లతో ఆకట్టుకుంది.

టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్లు మంచి ఫామ్ లో ఉండటంతో పాటు, మిడిల్ ఆర్డర్ లో విరాట్ కోహ్లి, సురేష్ రైనాలు మెరుస్తుండటంతో భారత్ ఆడుతూ పాడుతూ ముందుకు సాగుతోంది.  మరోవైపు  యువ బౌలర్లు బూమ్రా, హార్దిక్ పాండ్యాలు తమ బాధ్యతను సక్రమంగా నిర్వరిస్తూ విజయంలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో చివరి మ్యాచ్ కు కొండంత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది టీమిండియా. మూడో టీ 20లో కూడా పాత ఫలితాన్నే పునరావృతం చేసి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని  ధోని భావిస్తోంది. అయితే ఆసీస్ మాత్రం టీమిండియాను కనీసం ఆఖరి మ్యాచ్ లోనైనా కట్టడి చేయాలని యోచిస్తోంది.  టీమిండియాపై తమదే ఎంతో కొంత పైచేయి అనే చెప్పుకోవాలంటే ఆసీస్ కు గెలుపు అనివార్యం. అంతకుముందు వరుస నాలుగు వన్డేలను గెలిచిన ఆసీస్.. చివరి వన్డేలో ఓటమి పాలైన అనంతరం పరాజయాల బాటపట్టింది. ఐదో వన్డేలో విజయంతో కలుపుకుని టీమిండియా ఇప్పటివరకూ వరుసగా మూడు విజయాలను సాధించింది. మరో మ్యాచ్ ల్లో ధోని సేన గెలిస్తే మాత్రం ఆసీస్ గెలిచిన నాలుగు మ్యాచ్ ల లెక్కను సరిచేసినట్లవుతుంది. రేపటి మ్యాచ్ నామమాత్రమే అయినప్పటికీ గెలుపు కోసం ఇరు జట్లు తీవ్రంగా పోరాడతాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

చివరి మ్యాచ్ కు ఫించ్ అవుట్

మూడో టీ-20 నుంచి ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ దూరమయ్యాడు. మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో టీ-20 మ్యాచ్ సందర్భంగా గాయపడిన ఫించ్ తోడ కండరాలు పట్టేడయంతో మూడో టీ-20 మ్యాచ్‌లో ఆడే అవకాశం లేదని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)తెలిపింది.  ఆస్ట్రేలియా జట్టుకు ఆల్‌రౌండర్ షేన్‌ వాట్సన్ నాయకత్వం వహిస్తుండగా,  ఫించ్‌ స్థానంలో లెప్ట్‌ హ్యాండ్ బ్యాట్స్‌మన్ ఉస్మాన్ ఖాజాను జట్టులోకి తీసుకున్నారు. రెండు ట్వంటీ20ల్లో తనదైన ముద్రతో చెలరేగిపోయిన ఫించ్ లేకపోవడం ఆసీస్ కు ఎదురుదెబ్బగానే చెప్పొచ్చు.

యువీకి అవకాశం వచ్చేనా!

ఆసీస్ తో ద్వైపాక్షిక సిరీస్ లోభాగంగా కేవలం ట్వంటీ 20 లకు మాత్రమే ఎంపికైన యువరాజ్ సింగ్  ఆటను చూడాలనుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది.రెండేళ్ల క్రితం ఆఖరిసారిగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన అతను ఎట్టకేలకు జాతీయ జట్టులో పునరాగమనం చేసినా ఇంకా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు.  ఈ మ్యాచ్‌లోనైనా యువీకి బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చి, ఎక్కువ ఓవర్లు ఆడగలిగితే ప్రపంచ కప్ ప్రణాళికలు సిద్ధం చేయడం సులభతరం అవుతుంది

పిచ్, వాతావరణం

సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ కూడా బ్యాటింగ్ పిచ్ కావడంతో భారీ పరుగులు వచ్చే అవకాశం ఉంది.  అంతకుముందు ఇరు జట్ల మధ్య ఇక్కడ జరిగిన చివరి వన్డేలో 600 పైగా పరుగులు రావడం విశేషం.  ఈ మ్యాచ్ లో  టీమిండియా 330 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. వాతావరణం విషయానికొస్తే ఆకాశం మేఘావృతమై ఉన్నప్పటికీ వర్షం పడే అవకాశాలు దాదాపు లేవు.  కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్, గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement