టీమిండియాను ఊరిస్తున్న మొహాలి!
మొహాలి: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియాను విజయం ఊరిస్తోంది. టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ లో నిలకడగా బ్యాటింగ్ కొనసాగించడమే ఇందుకు కారణం. ప్రస్తుతం 142 పరుగుల ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. మూడో రోజు సాధ్యమైనంత సమయం క్రీజ్ లో ఉండి మరో 100 పరుగులు చేసినా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఆది నుంచి చర్చల్లో నిలిచిన మొహాలి పిచ్ లో తొలుత స్పిన్నర్లే హవానే కొనసాగినా.. టీమిండియా తన రెండో ఇన్నింగ్స్ లో సఫారీల స్పిన్ ను దిగ్విజయంగా అడ్డుకుందనే చెప్పాలి. టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో కోల్పోయిన రెండు వికెట్లలో ఒక వికెట్ మాత్రమే స్పిన్నర్ తాహీర్ కు లభించింది. ఈ మ్యాచ్ ను ఇప్పటివరకూ చూస్తే టీమిండియానే పైచేయి సాధించింది.
శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి 40 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా 125 పరుగులు చేసి ఆధిక్యం దిశగా ముందుకు సాగుతోంది. ఓపెనర్ శిఖర్ ధవన్ రెండో ఇన్నింగ్స్ లో కూడా డకౌట్ గా పెవిలియన్ కు చేరి నిరాశపరిచినా.. మరో ఓపెనర్ మురళీ విజయ్ (47) హాఫ్ సెంచరీ అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు. టీమిండియా స్కోరు 95 పరుగుల వద్ద ఉండగా మురళీ విజయ్ రెండో వికెట్ గా పెవిలియన్ కు చేరాడు. ఆ తరుణంలో చటేశ్వరా పూజారాకు జత కలిసిన కెప్టెన్ విరాట్ కోహ్లి బాధ్యతాయుతంగా ఆడి స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. ఆట ముగిసే సమయానికి పూజారా(63 బ్యాటింగ్), విరాట్ కోహ్లి(11 బ్యాటింగ్) క్రీజ్ లో ఉన్నారు. అంతకుముందు 28/2 ఓవర్ నైట్ స్కోరుతో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా 184 పరుగులకు చాపచుట్టేసింది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో డివిలియర్స్ (63), ఆమ్లా(43), ఎల్గర్(37) తప్పా మిగతా ఆటగాళ్లందరూ సింగిల్ నంబర్ స్కోరుకే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో అశ్విన్ అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు నేలకూల్చాడు. రవీంద్ర జడేజా 3, అమిత్ మిశ్రా 2 వికెట్లు పడగొట్టారు.