హోరాహోరీగా తొలి టెస్టు
మొహాలి: దక్షిణాఫ్రికా-టీమిండియాల మధ్య ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ హోరా హోరీగా సాగుతోంది. 28/2 ఓవర్ నైట్ స్కోరుతో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా 184 పరుగులకు పరిమితం కాగా, ఆ తరువాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా టీ విరామ సమయానికి వికెట్ నష్టానికి 13 పరుగులతో ఆడుతోంది. తొలి ఇన్నింగ్స్ లో డకౌట్ గా వెనుదిరిగిన ఓపెనర్ శిఖర్ ధవన్ రెండో ఇన్నింగ్స్ లో కూడా పరుగులేమీ చేయకుండా పెవిలియన్ కు చేరాడు. మురళీ విజయ్(11), చటేశ్వర పూజారా(2) క్రీజ్ లో ఉన్నారు. దీంతో టీమిండియాకు ప్రస్తుతం 30 పరుగుల ఆధిక్యం లభించింది. రెండు రోజులు ముగియకుండానే 21 వికెట్లు నేలరాలడంతో మ్యాచ్ లో ఫలితం వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో డివిలియర్స్ (63), ఆమ్లా(43), ఎల్గర్(37) తప్పా మిగతా ఆటగాళ్లందరూ సింగిల్ నంబర్ స్కోరుకే పరిమితమయ్యారు. భారీ భాగస్వామ్యాలు నమోదు కాకుండా వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో ప్రొటీస్ టీమ్ తొలి ఇన్నింగ్స్ లో స్వల్ప స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లలో అశ్విన్ అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు నేలకూల్చాడు. రవీంద్ర జడేజా 3, అమిత్ మిశ్రా 2 వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 201 పరుగులకు ఆలౌటైంది.