విశాఖ: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 203 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని సాధించింది. 395 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలను 191 పరుగులకే ఆలౌట్ చేసి ఘన విజయం సాధించింది. ఆదివారం చివరి రోజు ఆటలో భారత బౌలర్లు చెలరేగిపోవడంతో సఫారీలు తలవంచక తప్పలేదు. ప్రధానంగా పేసర్ మహ్మద్ షమీ విజృంభణకు తోడు స్పిన్నర్ రవీంద్ర జడేజా మ్యాజిక్ జత కావడంతో దక్షిణాఫ్రికా తేలిపోయింది. కాగా, చివరి వరుస ఆటగాళ్లు పీయడ్త్-ముత్తుసామిలు తీవ్రంగా ప్రతిఘటించడంతో భారత్ విజయం ఆలస్యమైంది.
టెయిలెండర్ల పోరాట స్ఫూర్తి
లంచ్‌లోపే భారత్ విజయం సాధిస్తుందని అనుకుంటే, పీయడ్త్-ముత్తుసామిలు 32 ఓవర్లు పాటు క‍్రీజ్‌ను అంటిపెట్టుకుని ఉండటంతో రెండో సెషన్ వరకూ ఆగాల్సి వచ్చింది. పీయడ్త్(56; 107 బంతుల్లో 9 ఫోర్లు, 1సిక్స్), ముత్తుసామి(49 నాటౌట్; 108 బంతుల్లో 5 ఫోర్లు) పోరాట స్ఫూర్తిని ప్రదర్శించారు. 91 పరుగుల భాగస్వామ్యంతో ఆకట్టుకున్నారు. కాగా, తొమ్మిదో వికెట్‌గా పీయడ్త్ ఔటైన తర్వాత కగిసో రబడా(18) ఎంతసేపో క్రీజ్‌లో నిలవలేదు. వీరిద్దర్నీ షమీ ఔట్ చేసి భారత్‌కు విజయం ఖాయం చేశాడు. సఫారీల రెండో ఇన్నింగ్స్‌లో షమీ ఐదు వికెట్లు సాధించగా, జడేజా నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. అశ్విన్‌కు వికెట్ దక్కింది.
తొలి సెషన్‌లోనే ఎదురుదెబ్బ
11/1 ఓవర్‌నైట్ స్కోరుతో ఆటను కొనసాగించిన సఫారీలకు తొలి సెషన్‌లోనేఎదురుదెబ్బ తగిలింది. ఓవర్‌నైట్ ఆటగాడు బ్రయాన్‌ను రెండో వికెట్‌ను అశ్విన్ పెవిలియన్‌కు పంపి మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ఆపై పేసర్ మహ్మద్ షమీ చెలరేగిపోయాడు. పిచ్ నుంచి బౌన్స్, స‍్వింగ్ రాబడుతూ దక్షిణాఫ్రికా టాపార్డర్ వెన్నువిరిచాడు. 40 పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లను పెవిలియన్‌కు పంపడంతో దక్షిణాఫ్రికా తేరుకోలేకపోయింది. బావుమాను డకౌట్‌గా పెవిలియన్‌కు పంపిన తర్వాత, డుప్లెసిస్, డీకాక్(0)లను షమీ ఔట్ చేశాడు.
ఇక అటు తర్వాత తన స్పిన్‌తో మాయాజాలం చేశాడు రవీంద్ర జడేజా. కాస్త వేగాన్ని జోడించి బంతిని రెండు వైపులకు తిప్పుతూ సఫారీలను ముప్పుతిప్పలు పెట్టాడు. ఈ క్రమంలోనే మార్కరమ్(39),ఫిలిండర్(0), మహరాజ్(0)లను తొందరగా పెవిలియన్‌కు పంపాడు. ఒకే ఓవర్‌లో ఈ ముగ్గుర్నీ ఔట్ చేయడం విశేషం. ఇన్నింగ్స్ 27 ఓవర్ తొలి బంతికి ఓపెనర్ మార్కరమ్‌ను ఔట్ చేసిన జడేజా.. అదే ఓవర్ నాల్గో బంతికి ఫిలిండర్‌ను ఔట్ చేశాడు. ఇక ఐదో బంతికి కేశవ్ మహరాజ్‌ను పెవిలియన్‌కు పంపడంతో సఫారీలు 70 పరుగులకే 8 వికెట్లు కోల్పోయారు. చివరి వరుస ఆటగాళ్లలో ముత్తుసామీ, పీయడ్త్‌లు తీవ్రంగా ప్రతిఘటించినా మ్యాచ్‌ను కనీసం డ్రా చేయడంలో మాత్రం విఫలమయ్యారు. ఫలితంగా సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యం సాధించింది.
భారత్ తొలి ఇన్నింగ్స్ 502/7 డిక్లేర్డ్, రెండో ఇన్నింగ్స్ 323/4 డిక్లేర్డ్
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 431 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 191 ఆలౌట్
Comments
Please login to add a commentAdd a comment