
బ్రెడా (నెదర్లాండ్స్): స్వదేశీ కోచ్ హరేంద్ర సింగ్ ఆధ్వర్యంలో చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత జట్టు దూసుకెళ్తోంది. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై నెగ్గిన టీమిండియా ఆదివారం రెండో మ్యాచ్‌లో రియో ఒలింపిక్స్ చాంపియన్, రెండో ర్యాంకర్ అర్జెంటీనాపై 2–1తో విజయం సాధించింది. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ (17వ నిమిషంలో), మన్‌దీప్ సింగ్ (28వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. అర్జెంటీనా తరఫున నమోదైన ఏకైక గోల్ డ్రాగ్‌ఫ్లికర్ గొంజాలో పెలాట్ (30వ నిమిషంలో) చేశాడు. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో రెండు విజయాలు నమోదు చేసిన భారత్ ప్రస్తుతం ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. బుధవారం తదుపరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో టీమిండియా ఆడనుంది.
రెండో క్వార్టర్‌లో రెండు గోల్స్...
తొలి క్వార్టర్‌లో గోల్ కాకపోయినా... రెండో క్వార్టర్ ప్రారంభం నుంచే దాడులు ఉధృతం చేసిన భారత్‌కు 17వ నిమిషంలో తొలి పెనాల్టీ కార్నర్ (పీసీ) దక్కింది. దాన్ని హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్ పోస్ట్‌లోకి పంపి భారత్‌కు 1–0తో ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత 28వ నిమిషంలో దిల్‌ప్రీత్ ఇచ్చిన పాస్‌ను మన్‌దీప్ అద్భుత గోల్‌గా మలిచి ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు. కాపేసటికే అర్జెంటీనాకు పీసీ లభించగా... దాన్ని గొంజాలో గోల్‌గా మలిచి ఆధిక్యాన్ని 2–1కి తగ్గించాడు. అనంతరం భారత్ జోరు కొనసాగించడంతో ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం చిక్కలేదు. ఈ మ్యాచ్ భారత వెటరన్ ప్లేయర్ సర్దార్ సింగ్‌కు 300వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment