సఫారీలపై సగర్వంగా... | india team entered in T20 world cup finals | Sakshi
Sakshi News home page

సఫారీలపై సగర్వంగా...

Published Sat, Apr 5 2014 12:40 AM | Last Updated on Sat, Sep 2 2017 5:35 AM

సఫారీలపై సగర్వంగా...

సఫారీలపై సగర్వంగా...

 టి20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్
 సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై ఆరు వికెట్లతో విజయం
 అశ్విన్ సూపర్ బౌలింగ్
 కోహ్లి సంచలన బ్యాటింగ్
 శ్రీలంకతో ఫైనల్ ఆదివారం
 
 వారెవ్వా... ఏం బ్యాటింగ్..! ఒక శిల్పి ఓపికగా ఓ శిల్పాన్ని చెక్కినట్లు... ఓ కళాకారుడు అలుపులేకుండా సౌధాన్ని నిర్మించినట్లు..! భారత క్రికెటర్లు కూడా అద్భుతం చేశారు. టి20 క్రికెట్‌లో పరుగులు చేయడం ఇంత సులభమా..! అని ప్రపంచం ఆశ్చర్యపోయేలా 173 పరుగుల లక్ష్యాన్ని మంచినీళ్లు తాగినంత సులభంగా ‘ఊదిపారేశారు’. ఓ పద్ధతి ప్రకారం ఆడి చక్కటి భాగస్వామ్యాలతో సఫారీలను చిత్తు చేసి... భారత్ సగర్వంగా టి20 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరింది.
 
 ఢాకా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి
 పాపం... చోకర్స్ అనే ముద్ర తొలగించుకోవడానికి దక్షిణాఫ్రికా క్రికెటర్లు విశ్వప్రయత్నాలు చేశారు. బాగా బ్యాటింగ్ చేశారు... కళ్లుచెదిరే క్యాచ్‌లు పట్టుకున్నారు... కుదురుగా బౌలింగ్ చేశారు. కానీ వేటగాళ్లను మాత్రం ఆపలేకపోయారు. టోర్నీలో తొలిసారి భారత బౌలర్లు విఫలమైనా... బ్యాట్స్‌మెన్ చెలరేగి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. షేరే బంగ్లా స్టేడియంలో శుక్రవారం జరిగిన టి20 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్లో భారత్ ఆరు వికెట్లతో దక్షిణాఫ్రికాపై గెలిచింది.
 
 173 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 19.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (13 బంతుల్లో 24; 4 ఫోర్లు, 1 సిక్సర్), రహానే (30 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్సర్) మంచి ఆరంభాన్నిచ్చారు. ఈ ఇద్దరూ అవుటైనా... పరుగుల వేటగాడు విరాట్ కోిహ్ల  (44 బంతుల్లో 72 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అత్యద్భుతమైన ఇన్నింగ్స్‌తో భారత్‌కు విజయాన్ని అందించాడు. యువరాజ్ (17 బంతుల్లో 18; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించగా... సురేశ్ రైనా (10 బంతుల్లో 21; 3 ఫోర్లు, 1 సిక్సర్) ఒత్తిడిలో చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో హెండ్రిక్స్ రెండు వికెట్లు తీసుకున్నాడు.

 అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్లకు 172 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ ఆమ్లా (16 బంతుల్లో 22; 4 ఫోర్లు) మంచి ఆరంభాన్నివ్వగా... దక్షిణాఫ్రికా కెప్టెన్ డు ప్లెసిస్ (41 బంతుల్లో 58; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) నాణ్యమైన ఇన్నింగ్స్‌తో అర్ధసెంచరీ చేశాడు. డుమిని (40 బంతుల్లో 45 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లు) ఇన్నింగ్స్‌కు వెన్నుముకలా నిలిచాడు. డు ప్లెసిస్, డుమిని మూడో వికెట్‌కు 71 పరుగులు జోడించారు.
 
 
 చివర్లో మిల్లర్ (12 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్సర్) వేగంగా ఆడాడు. డుమిని, మిల్లర్ చివరి 4.3 ఓవర్లలో అజేయంగా 43 పరుగులు జోడించడం విశేషం. భారత బౌలర్లలో అశ్విన్ మూడు, భువనేశ్వర్ ఒక్క వికెట్ తీశారు. అశ్విన్, జడేజా మినహా భారత బౌలర్లు ఈసారి భారీగా పరుగులు సమర్పించుకున్నారు. కోహ్లికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఆదివారం ఇదే స్టేడియంలో జరిగే ఫైనల్లో భారత్ జట్టు శ్రీలంకతో తలపడుతుంది.
 
 భాగస్వామ్యాలే కీలకం: ఏ ఫార్మాట్‌లో అయినా భాగస్వామ్యాలు కీలకమనేది ధోని పదేపదే చెప్పే మాట. దక్షిణాఫ్రికాతో సెమీస్‌లో భారీ లక్ష్యం కళ్లముందున్నా భారత్ గెలవడానికి కారణం చిన్న చిన్న భాగస్వామ్యాలే. 39, 38, 56, 34... ఇవీ భారత ఇన్నింగ్స్‌లో భాగస్వామ్యాలు. ఇందులో మొదటి దానిలో తప్ప మిగిలిన మూడింటిలో కోహ్లి భాగస్వామి. ముఖ్యంగా యువరాజ్ నెమ్మదిగా ఆడినట్లు కనిపించినా... కోహ్లితో కలిసి మూడో వికెట్‌కు నెలకొల్పిన 56 పరుగుల భాగస్వామ్యం (39 బంతుల్లో) మ్యాచ్‌కు కీలకం.
 
 6 2000 నుంచి భారత్ తాను ఆడిన ఆరు ఐసీసీ సెమీ ఫైనల్స్‌లో విజయం సాధించగా...దక్షిణాఫ్రికా తాను ఆడిన ఆరు ఓడింది.
 
 3 2010లో మినహా ప్రతీ టి20 ప్రపంచకప్ ఫైనల్‌కు ఆసియా జట్టు అర్హత సాధించింది. 2007, 2009 తర్వాత మరో సారి రెండు ఆసియా జట్లు ఫైనల్లో తలపడనున్నాయి.
 
 1 తొలిసారి బ్యాటింగ్‌కు దిగి 170 పైచిలుకు పరుగులు చేశాక దక్షిణాఫ్రికా ఓడిపోవడం ఇదే తొలిసారి
 
 ద్వితీయార్ధంలో జోరు
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ నాలుగో బంతికే భువనేశ్వర్ తన స్వింగ్‌తో డికాక్‌ను పెవిలియన్‌కు పంపడంతో భారత్‌కు మంచి ఆరంభం వచ్చింది. కానీ ఆమ్లా ఎదురుదాడికి దిగడంతో మోహిత్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. పరుగుల వేగం పెరుగుతున్న సమయంలో ఆరో ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన అశ్విన్... ఆమ్లాను బౌల్డ్ చేశాడు. పవర్‌ప్లే ఆరు ఓవర్లలో దక్షిణాఫ్రికా 2 వికెట్లకు 44 పరుగులు చేసింది.
 
 ఆరు నుంచి పదో ఓవర్‌వరకు డు ప్లెసిస్, డుమిని క్రీజులో కుదురుకునేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత చెలరేగిపోయారు. 11 నుంచి 15 ఓవర్లలో దక్షిణాఫ్రికా ఏకంగా 61 పరుగులు చేసింది.
 
 అశ్విన్ తన రెండు ఓవర్లలో రెండు వికెట్లు తీశాడు. కానీ భారీ హిట్టర్లు ఉన్న దక్షిణాఫ్రికా తగ్గలేదు. చివరి ఐదు ఓవర్లలో 42 పరుగులు చేసింది.
 
 తొలి పది ఓవర్లలో 66 పరుగులు వస్తే ఆఖరి 10 ఓవర్లలో 106 పరుగులు వచ్చాయి. మిశ్రా బౌలింగ్‌ను బాగా చదివిన దక్షిణాఫ్రికా ఆటగాళ్లు భారత లెగ్ స్పిన్నర్ బౌలింగ్‌లో భారీగా పరుగులు రాబట్టారు.
 
 అలవోకగా... ఓ పద్ధతి ప్రకారం...
 రోహిత్ శర్మ ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగాడు. స్టెయిన్ బౌలింగ్‌లో అద్భుతమైన సిక్సర్ కొట్టాడు. అదే ఊపులో హెండ్రిక్స్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి వెళ్లి అవుటయ్యాడు.
 
 మరో ఎండ్‌లో రహానే సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేస్తూనే... పార్నెల్ బౌలింగ్‌లో కళ్లుచెదిరే సిక్సర్ బాదాడు. మొత్తానికి పవర్ ప్లే ఆరు ఓవర్లలో భారత్ వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది.వేగం పెంచే ప్రయత్నంలో రహానే అవుటయ్యాడు. ఆ లోపు కోహ్లి క్రీజులో కుదురుకోవడానికి సమయం తీసుకున్నాడు. 10 ఓవర్లలో భారత్ 2 వికెట్లకు 80 పరుగులు చేసింది.
 
 యువరాజ్ కుదురుకోవడానికి సమయం తీసుకుంటే... ఆ సమయంలో కోహ్లి హిట్టింగ్ మొదలుపెట్టాడు. తాహిర్ బౌలింగ్‌లో సిక్సర్‌తో కోహ్లి 35 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. కోహ్లితో 56 పరుగుల భాగస్వామ్యం తర్వాత యువరాజ్ భారీషాట్‌కు వెళ్లి అవుటయ్యాడు.
 
 విజయానికి 4 ఓవర్లలో 40 పరుగులు అవసరమైన దశలో... రైనా వచ్చి సిక్సర్‌తో ఖాతా తెరిచాడు. రైనా జోరుతో పార్నెల్ వేసిన 17వ ఓవర్లో ఏకంగా 17 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత భారత్ వెనుదిరిగి చూడలేదు.
 
 సెమీస్‌లో ఇలాంటి ఇన్నింగ్స్ ఆడినందుకు సంతోషంగా ఉంది. మంచి ఫామ్‌లో ఉన్నా. చివరి వరకూ ఒకరు క్రీజులో ఉంటే మ్యాచ్ గెలవచ్చని తెలుసు. విన్నింగ్ రన్ కొట్టడంలో ఆనందం ఉంటుంది. అందుకే నేను విన్నింగ్న్ ్రకొట్టాలని అనుకుని ధోని సింగిల్ తీయకుండా నాకు అవకాశం ఇచ్చాడు. 173 పెద్ద లక్ష్యం అని తెలుసు. కానీ టెన్షన్ పడలేదు. మానసికంగా బలంగా ఉంటే ఛేజింగ్ చేయడం సులభం. రెండు మంచి భాగస్వామ్యాలు నమోదైతే గెలుస్తామని తెలుసు. అందుకే అందరం కూల్‌గా ఉన్నాం. బౌలర్ల వల్లే సెమీస్‌కు వచ్చాం.                             - విరాట్ కోహ్లి
 
 స్కోరు వివరాలు
 దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (సి) ధోని (బి) భువనేశ్వర్ 6; ఆమ్లా (బి) అశ్విన్ 22; ప్లెసిస్ (బి) అశ్విన్ 58; డుమిని నాటౌట్ 45; డివిలియర్స్ (సి) రోహిత్ (బి) అశ్విన్ 10; మిల్లర్ నాటౌట్ 23; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 172
 
 వికెట్ల పతనం: 1-9; 2-44; 3-115; 4-129; బౌలింగ్: భువనేశ్వర్ 4-0-33-1; మోహిత్ శర్మ 3-0-34-0; అశ్విన్ 4-0-22-3; జడేజా 2-0-8-0; రైనా 4-0-35-0; మిశ్రా 3-0-36-0.
 
 భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) డు ప్లెసిస్ (బి) హెండ్రిక్స్ 24; రహానే (సి) డివిలియర్స్ (బి) పార్నెల్ 32; కోహ్లి నాటౌట్ 72; యువరాజ్ (సి) డివి లియర్స్ (బి) తాహిర్ 18; రైనా (సి) డు ప్లెసిస్ (బి) హెండ్రిక్స్ 21; ధోని నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (19.1 ఓవర్లలో 4 వికెట్లకు) 176
 
 వికెట్ల పతనం: 1-39; 2-77; 3-133; 4-167. బౌలింగ్: డుమిని 3-0-29-0; మోర్కెల్ 2-0-17-0; స్టెయిన్ 3.1-0-36-0; హెండ్రిక్స్ 4-0-31-2; పార్నెల్ 3-0-33-1; తాహిర్ 4-0-30-1.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement