'ఆధిక్యం' ఎవరిదో...
►మరో విజయంపై భారత్ గురి
► కోహ్లి, రైనాపై దృష్టి
► దక్షిణాఫ్రికా కోలుకునేనా!
► నేడు రాజ్‌కోట్‌లో మూడో వన్డే
దక్షిణాఫ్రికా చేతిలో వరుసగా మూడు పరాజయాల తర్వాత గెలుపు దక్కడంతో భారత జట్టుపై ఇప్పుడు కాస్త ఒత్తిడి తొలగింది. మొదటి విజయం కోసం తీవ్రంగా శ్రమించిన భారత్... ఇక ఇదే జోరును కొనసాగించాల్సి ఉంది. టీమిండియా ఏ ఒక్కరి ప్రదర్శనపైనో ఆధార పడకుండా సమష్టిగా ఆడితే సిరీస్‌ను గెలుచుకునే దిశగా మరో అడుగు ముందుకు వేస్తుంది. గత మ్యాచ్‌లో సునాయాస విజయం చేజారడంతో కాస్త షాక్‌కు గురైన సఫారీలు ఈసారి కోలుకోగలరా నేది ఆసక్తికరం.
రాజ్‌కోట్: వన్డే సిరీస్ సమంగా నిలిచిన స్థితిలో ఇక ఆధిక్యం కోసం భారత్, దక్షిణాఫ్రికా సిద్ధమయ్యాయి. నేడు (ఆదివారం) ఇక్కడ జరిగే మూడో వన్డే మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. ప్రస్తుతం ఐదు వన్డేల సిరీస్‌లో ఇరు జట్ల 1-1తో ఉండగా... ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ దక్కించుకునే అవకాశాలు మెరుగవుతాయి. ఈ నేపథ్యంలో బ్యాటింగ్‌కు స్వర్గధామంలాంటి సౌరాష్ట్ర క్రికెట్ సంఘం మైదానంలో హోరాహోరీ పోరు ఖాయం. గత మ్యాచ్‌లో గెలుపుతో ధోని సేనలో ఆత్మవిశ్వాసం పెరిగింది. అటు బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో మ్యాచ్ కోల్పోయిన దక్షిణాఫ్రికా దానిని పునరావృతం చేయరాదని పట్టుదలగా ఉంది.
మార్పులు లేకుండానే...
ఇండోర్‌లో భారత విజయంలో ఆటగాళ్లందరి సమష్టి కృషి ఉంది. కెప్టెన్ ధోని తాను ముందుండి జట్టును నడిపించగా... మిగతావారు అతడిని అనుసరించారు. ధోని ఫామ్ గురించి బెంగ తీరిపోయినా, కోహ్లి, రైనా మాత్రం ఇంకా టచ్‌లోకి రాలేదు. వీరిద్దరు కూడా ఈ మ్యాచ్‌లో చెలరేగితే భారత్‌కు తిరుగుండదు. ఓపెనర్ శిఖర్ ధావన్‌కు ఈ సిరీస్‌కంటే ముందు దక్షిణాఫ్రికాపై మంచి రికార్డు ఉంది. కానీ వరుసగా రెండు మ్యాచ్‌లలో విఫలమైన అతడి నుంచి భారీ ఇన్నింగ్స్ రావాల్సి ఉంది. గత మ్యాచ్‌లో విఫలమైనా, సొంతగడ్డపై దాదాపు 70 సగటు ఉన్న రోహిత్ శర్మ బ్యాటింగ్‌పై ఎలాంటి సందేహాలు లేవు. రహానే కూడా మూడో స్థానంలో వచ్చి వరుసగా రెండు అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నాడు. రెండో వన్డేలో కీలక దశలో వికెట్లు తీసి భారత్‌కు గెలుపు బాట పరచిన అక్షర్ పటేల్‌కు స్థానం ఖాయం కాబట్టి అమిత్ మిశ్రాకు మరోసారి నిరాశ తప్పదు. భువనేశ్వర్ గత మ్యాచ్‌లో ఆకట్టుకోగా, ఉమేశ్ మాత్రం భారీగా పరుగులిచ్చాడు. అయితే తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది.
ఆమ్లా ఫామ్‌పై ఆందోళన...
సునాయాస లక్ష్యాన్ని ఛేదించడంలో కూడా గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. ముఖ్యంగా స్పిన్‌ను ఎదుర్కోలేక వారు విఫలం కావడం జట్టు మేనేజ్‌మెంట్‌లో ఆందోళన పెంచుతోంది. డివిలియర్స్‌కు ఎప్పుడైనా చెలరేగే సత్తా ఉండగా, డు ప్లెసిస్ ఒక్కడే పూర్తిగా ఫామ్‌లో కనిపిస్తున్నాడు. డుమిని టి20 తరహా ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. ఘోరంగా విఫలమవుతున్న డేవిడ్ మిల్లర్ జట్టు బలహీనతగా మారాడు. అయితే మరో ప్రత్యామ్నాయ బ్యాట్స్‌మన్ లేక అతణ్ని కొనసాగిస్తున్నారు. అతడిని ఈ మ్యాచ్‌లో పక్కన పెడితే ఆల్‌రౌండర్ మోరిస్‌ను ఆడించే అవకాశముంది.
అయితే అన్నింటికి మంచి ప్రధాన బ్యాట్స్‌మన్ హషీం ఆమ్లా ఫామ్ సఫారీలకు సమస్యగా మారింది. ఈ టూర్‌లో అతను ఒక్క మ్యాచ్‌లోనూ ఆకట్టుకోలేకపోయాడు. మరో 27 పరుగులు చేస్తే వన్డేల్లో 6 వేల పూర్తి చేసుకునే ఆమ్లా ఈ మ్యాచ్‌లోనైనా రాణించాలని జట్టు ఆశిస్తోంది. బౌలింగ్‌లో సీనియర్లు స్టెయిన్, మోర్కెల్‌కంటే కుర్రాడు రబడ ఒక్కసారిగా దూసుకొచ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు. భారత బ్యాట్స్‌మెన్‌ను అతడే ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాడు. అయితే తమ అనుభవంతో స్టెయిన్, మోర్కెల్ జట్టును ఆదుకోగలరు. ఇమ్రాన్ తాహిర్ కూడా తన స్పిన్‌తో ప్రత్యర్థిని ఇబ్బంది పెడుతున్నాడు. ఇరు జట్ల బలాబలాలను బట్టి చూస్తే మ్యాచ్ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది.
మధ్యాహ్నం గం. 1.30 నుంచి
స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం
పిచ్, వాతావరణం
పూర్తిగా బ్యాటింగ్ వికెట్. భారీ స్కోరుకు అవకాశం ఉంది. రాత్రి పూట మంచు ప్రభావం లేదు. రెండున్నరేళ్ల క్రితం ఇక్కడ జరిగిన ఏకైక వన్డేలో మొత్తం 641 పరుగులు నమోదయ్యాయి. వర్షం పడే సూచనలు లేవు.
జట్ల వివరాలు (అంచనా)
భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, రహానే, కోహ్లి, రైనా, హర్భజన్, అక్షర్, భువనేశ్వర్, ఉమేశ్, మోహిత్.
దక్షిణాఫ్రికా: డివిలియర్స్ (కెప్టెన్), డి కాక్, ఆమ్లా, డు ప్లెసిస్, డుమిని, మిల్లర్, బెహర్దీన్, స్టెయిన్, రబడ, మోర్కెల్, తాహిర్.
గత మ్యాచ్‌లో గెలుపు తర్వాత మా జట్టులో వాతావరణం చాలా బాగుంది. వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడితే కోలుకోవడం కష్టమయ్యేది. ధోని బ్యాటింగ్ అందరి ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. మా బౌలర్లు కూడా 25-30 బంతులు ఎదుర్కోగలడం మంచి పరిణామం. ఆటగాళ్లు తమకు అప్పగించిన బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తే చాలు. ప్రత్యర్థి జట్టులో ప్రతీ ఒక్కరి కోసం మా వద్ద వ్యూహాలు ఉన్నాయి. చివరి 10 ఓవర్లలో మరో ఫీల్డర్‌ను ఉంచాలనే కొత్త నిబంధన బౌలర్లకు ఎంతో ప్రయోజనకరంగా మారింది. నేను గతంలోలాగా బంతిని స్వింగ్ చేయలేకపోతున్నాననే వాదనను అంగీకరించను. ఐపీఎల్ వల్ల చివరి ఓవర్లలో కూడా బాగా బౌలింగ్ చేయగలుగుతున్నా
భువనేశ్వర్ కుమార్, భారత బౌలర్
మా పొరపాట్ల వల్ల భారత్‌కు కోలుకునే అవకాశం ఇచ్చాం. లేదంటే సిరీస్ ఇప్పుడు 2-0తో ఉండేది. విజయంతో ప్రత్యర్థి జట్టు ఆత్మవిశ్వాసం పెరగడం మాకు ఇబ్బంది కలిగించేదే. ఈసారి అలాంటి తప్పులు జరగనివ్వం. స్పిన్‌ను ఆడలేమనడం వాస్తవం కాదు. తొలి వన్డేలో మేం స్పిన్‌ను చక్కగా ఎదుర్కొని 300కు పైగా పరుగులు చేశాం. ఒక్కసారి ఇన్నింగ్స్‌లో జోరు మొదలైతే దానిని ఆపడం ఎవరికైనా కష్టం. మూడో స్థానంలో ఆడుతూ జట్టును గెలిపించే ఇన్నింగ్స్ ఆడాల్సిన బాధ్యత నాపై ఉంది.
-డు ప్లెసిస్, దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్