
వాషింగ్టన్ సుందర్(ఫైల్ ఫోటో)
కొలంబో: అండర్-19 ముక్కోణపు టోర్నీలో భారత యువ జట్టు జైత్రయాత్ర కొనసాగిస్తోంది. గురువారం ఇక్కడ శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో టోర్నీలో తన చివరి లీగ్ ను ఘనంగా ముగించిన భారత్ వరుసగా నాలుగో విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచిన భారత్ తొలుత శ్రీలంకను బ్యాటింగ్ కు ఆహ్వానించింది.
దీంతో బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక 50.0 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. శ్రీలంక ఆటగాళ్లలో కవీన్ బండారా(74), కిమిందు మెండిస్(65)లు రాణించగా, కెప్టెన్ చరితా అసలంకా(22) ఫర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో ఖలీల్ అహ్మద్ నాలుగు వికెట్లు సాధించి శ్రీలంక భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నాడు. శ్రీలంక చివరి ఆరు వికెట్లను 55 పరుగుల వ్యవధిలో కోల్పోవడం గమనార్హం. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన భారత యువజట్టు 47.5 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసి విజయం సాధించింది. భారత్ ఆటగాళ్లలో వాషింగ్టన్ సుందర్(61), విరాట్ సింగ్(60 నాటౌట్) లు మరోసారి ఆకట్టుకుని జట్టు గెలుపులో సహకరించారు.